సోషల్ మీడియా నేటి కనీస అవసరం అయ్యింది. ఇది ప్రపంచవ్యాప్తంగా బిలియన్లకొద్దీ ప్రజలను కలుపుతూ వారికి సమాచారాన్ని అందిస్తోంది. ఈ ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్‌గా మార్చింది. ఇప్పుడే పుట్టిన ఆల్ఫా జనరేషన్ పిల్లల నుంచి వయోవృద్ధ సైలెంట్, వృద్ధ బేబీ బూమర్స్ వరకు అందరూ సోషల్ మీడియా ఫొటోలు, వీడియోలను ఆస్వాదిస్తున్నారు. సమ వయస్కులు, పాత సహచరులు, స్నేహితులు, బంధువులు, భౌతికంగా తెలియని ఆన్‌లైన్ స్నేహితులు, ఇతరులతో కనెక్ట్ అవ్వడం సోషల్ మీడియా వేదికల్లో ఒక విలువైన భాగం అవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న సభ్యులు తమ ఆలోచనలు, వార్తలను పంచుకోవడానికి ఒక సమావేశ స్థలంగా సోషల్ మీడియా మారింది.
5.79 బిలియన్ల నెటిజన్లు ఆన్‌లైన్‌లో కనెక్ట్
పౌర సమాజంపై సోషల్ మీడియా సానుకూల,ప్రతికూల ప్రభావాల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం జూన్ 30న ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవాన్ని పాటిస్తున్నాం. ప్రజలు ఒకరితో ఒకరు ఎలా కమ్యూనికేట్ చేస్తారో, స్నేహితులు, కుటుంబ సభ్యులు, మొత్తం ప్రపంచ జనాభాతో ఏం పంచుకుంటారో అనే దానిని సోషల్ మీడియా పునర్నిర్వచిస్తోంది. 2010లో ‘మ్యాషబుల్’ ద్వారా ఏర్పడిన ఈ వార్షిక కార్యక్రమం, ప్రపంచ కమ్యూనికేషన్, కమ్యూనిటీ నిర్మాణం, సాంస్కృతిక మార్పులపై డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రభావాన్ని వేడుకగా జరుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 5.79 బిలియన్ల మంది ప్రజలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను చురుకుగా ఉపయోగిస్తున్నారు, ఈ నెట్‌వర్క్‌లలో ప్రతిరోజూ ప్రతి ఒక్కరు సగటున 2 గంటల 27 నిమిషాలు గడుపుతున్నారు. జెన్ జడ్ యువత సగటు వినియోగదారుడి కంటే రోజుకు 54 శాతం ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై, యూజర్- జనరేటెడ్ కంటెంట్‌ను చూడటంలో గడుపుతున్నారు. 8 బిలియన్లకు పైగా ఉన్న ప్రపంచ జనాభాలో, 5.79 బిలియన్ల నెటిజన్లు ఆన్‌లైన్‌లో కనెక్ట్ అవుతున్నారు, సోషల్ మీడియా వినియోగదారులు ఇప్పుడు సూపర్ మెజారిటీగా ఉన్నారు.
మొదటి సోషల్ మీడియా సైట్‌గా ‘సిక్స్ డిగ్రీస్’
సోషల్ మీడియా భాగస్వాములు, బ్రాండ్‌లుగా మెటా, హూట్‌సూట్, స్ప్రౌట్ సోషల్, టిక్‌టాక్, లింక్‌డిన్, ఎక్స్/ట్విట్టర్, మ్యాడ్‌హేబుల్ మొదలైనవి బహుళ ప్రజాదరణ పొందాయి. 1997లో ప్రారంభించిన మొదటి సోషల్ మీడియా సైట్‌గా ‘సిక్స్ డిగ్రీస్’ను పరిగణిస్తారు. 2004లో ఫేస్‌బుక్‌ను సహ -స్థాపించిన మార్క్ జుకర్‌బర్గ్‌ను సోషల్ మీడియా
దినోత్సవ హీరోగా భావిస్తారు. మొదటి ఆధునిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 2002లో ఫ్రెండ్‌స్టర్. లింక్‌డిన్ 2003లో, ఫేస్‌బుక్ ప్రారంభమైన అదే సంవత్సరం 2004లో మైస్పేస్ ప్రారంభమయ్యాయి. యూట్యూబ్ 2005లో వీడియోల కోసం తన వెబ్‌సైట్‌ను ప్రారంభించగా, ట్విట్టర్ 2006లో దానిని అనుసరించింది. ఇన్‌స్టాగ్రామ్ 2010లో ప్రారంభమైంది. సోషల్ మీడియా వార్తలు, షాపింగ్, వ్యాపారాల కోసం ఇన్‌ఫ్లుయెన్సర్‌లను కనుగొనడం, సాధారణ వినోదం కోసం ఒక పెద్ద వనరుగా మారింది. నెలవారీ ఫేస్‌బుక్ వినియోగదారులు 3 బిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు 2 బిలియన్లకు పైగా, వాట్సాప్ వినియోగదారులు 2 బిలియన్లు, టిక్‌టాక్ వినియోగదారులు 1.5 బిలియన్లు, వీచాట్ వినియోగదారులు 1.3 బిలియన్లు ఉన్నారు. చైనాలోనే ఒక బిలియన్‌కు పైగా సోషల్ మీడియా వినియోగదారులు ఉండగా, భారతదేశంలో 870 మిలియన్లు, అమెరికాలో 313 మిలియన్లు, ఐరోపాలో 731 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. ఆన్‌లైన్‌లో కంటెంట్‌ను షేర్ చేసేటప్పుడు అసలు మూలానికి తగినంత గుర్తింపు ఇవ్వాలి. సోషల్ మీడియాను సానుకూల సాధనంగా ఉపయోగించాలి .
సోషల్ మీడియా వరమా, శాపమా!
సోషల్ మీడియాను అనుసంధానం, విద్య, వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే అది ఒక వరం. సైబర్ బెదిరింపులు, అభ్యంతరకరమైన కంటెంట్‌ను చూడటం లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి దారితీసినప్పుడు అది శాపంగా మారుతుంది. సోషల్ మీడియా ప్రభావం పూర్తిగా ఒక వ్యక్తి వినియోగం, స్వీయ క్రమశిక్షణ, డిజిటల్ అక్షరాస్యతపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్త జ్ఞానం, సమాచారాన్ని పంచుకోవడం, ఆర్థిక అవకాశాలకు ఆస్కారం కల్పించడం, భావ ప్రకటనా స్వేచ్ఛను ఇవ్వడం ద్వారా ఇది ఒక వరంగా మారింది. ప్రతికూల మార్గాల్లో ఉపయోగిస్తే అది ఒక ప్రమాదంగా మారుతోంది. నకిలీ వార్తలు వేగంగా వ్యాపించి ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేస్తూ విభజన కలిగించే 'ఎకో ఛాంబర్లను' సృష్టిస్తాయి. 'లైక్‌లు', అల్గారిథమిక్ స్క్రోలింగ్ డోపమైన్ లూప్ అత్యంత వ్యసనకరమైనది, ఇది ఉత్పాదకతనే కాకుండా ఏకాగ్రతను తగ్గిస్తుంది. గత శతాబ్దంలో విడుదలైన ఏ ఇతర సాంకేతికతతో పోల్చినా సమాజంపై అత్యంత పెద్ద ప్రభావాన్ని చూపింది సోషల్ మీడియా అనేది వాస్తవం.
డిజిటల్ ప్రపంచాన్ని
ఏకం చేయడం
ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం- 2026 ఇతివృత్తం ‘డిజిటల్ ప్రపంచాన్ని ఏకం చేయడం’ అనే అంశంతో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలను, సంస్కృతులను, వర్గాలను ఎలా కలుపుతాయో తెలియజేయడంపై దృష్టి పెడుతుంది. ఈ రోజు సామాజిక మాధ్యమ నిపుణులకు, సృష్టికర్తలకు, సాధారణ వినియోగదారులకు సోషల్ మీడియా వేడుకగా సంబురాలు జరుపుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది, అదే సమయంలో ప్లాట్‌ఫారమ్‌లను మరింత మెరుగ్గా, ఆరోగ్యకరంగా, నిజాయితీగా ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది. కొత్త ప్లాట్‌ఫారమ్‌ను ప్రయత్నించడం, ఆన్‌లైన్ చర్చలలో పాల్గొనడం, చిన్న వ్యాపారాన్ని లేదా స్వచ్ఛంద సంస్థను ప్రోత్సహించడం, మీ ఫీడ్‌బ్యాక్‌ను ఆడిట్ చేయడంవంటి అనేకవిధాలుగా సోషల్ మీడియా దినోత్సవాన్ని జరుపుకుంటారు
- ఆచార్య : మధుసూధన్ రెడ్డి బుర్ర
