నల్గొండ, వెలుగు: హైబ్రిడ్ రోడ్ల అభివృద్ధితో రాష్ట్ర రూపురేఖలు మారుతాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం నల్గొండలోని ప్రకాశం బజార్‌లో ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రోడ్ల అభివృద్ధి వల్ల పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని, పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
గత రెండేళ్లలో ప్లాన్, నాన్–ప్లాన్ నిధుల కింద రూ.7,110 కోట్లు మంజూరు చేయించి రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. అలాగే సీఆర్‌ఐ కింద జంక్షన్లు, సీసీ రోడ్ల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారంతో రూ.1,900 కోట్లు మంజూరు చేయించామని వెల్లడించారు. మరోసారి ఢిల్లీకి వెళ్లి అదనంగా రూ.1,000 కోట్ల నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ–హైదరాబాద్ ఫోర్‌లేన్‌కు టెండర్లు పిలిచామని, రీజినల్ రింగ్ రోడ్‌కు రూ.11 వేల కోట్లతో పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇటీవల నల్గొండలో నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ విజయవంతం కావడానికి సహకరించిన కాంగ్రెస్ నాయకులు, ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు
తెలిపారు.
