ప్రాణం పోయినా దీక్ష విరమించను: సోనమ్ వాంగ్‌‌‌‌చుక్

ప్రాణం పోయినా దీక్ష విరమించను: సోనమ్ వాంగ్‌‌‌‌చుక్

న్యూఢిల్లీ: లడఖ్‌‌‌‌కు రాజ్యాంగ రక్షణ  కల్పించాలనే డిమాండ్‌‌‌‌తో ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌‌‌‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం లడఖ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, చర్చలు నిలిచిపోవడంతోనే తాను మళ్లీ ఉద్యమబాట పట్టాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, " మళ్లీ నిరసన దీక్షకు కూర్చోవడం సులువు కాదు. ఈ పోరాటంలో నా ప్రాణాలు పోయినా సరే.. నేను మాత్రం వెనకడుగు వేయను" అని స్పష్టం చేశారు.

లడఖ్‌‌‌‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ కింద రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మే 22న కేంద్రంతో జరిగిన చర్చల ముగింపు వివరాలను అధికారికంగా కాగితంపై పెట్టడానికి ప్రభుత్వం వెనకాడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం మాట మార్చడం వల్లే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వాంగ్‌‌‌‌చుక్ కోరారు.