డబ్బులు లెక్కపెట్టే వాళ్లను మార్చండి : నెల క్రితం పోలీసులు హెచ్చరించినా పట్టించుకోని అయోధ్య ట్రస్ట్

డబ్బులు లెక్కపెట్టే వాళ్లను మార్చండి : నెల క్రితం పోలీసులు హెచ్చరించినా పట్టించుకోని అయోధ్య ట్రస్ట్

అయోధ్య రామ మందిరంలో రూ.200 కోట్ల విరాళాల గోల్ మాల్, నిధుల దుర్వినియోగం కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదురుకుంటున్న అయోధ్య రామ మందిర ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. రామ మందిరం విరాళాల లెక్కింపు విషయంలో గోల్ మాల్ జరుగుతోందని అనుమానించిన ఎస్బీఐ, విరాళాలు లెక్కపెట్టే సిబ్బందిని తొలగించాలని మూడు నెలల క్రితమే కోరిందని తెలుస్తోంది. అయితే..కొంతమంది ట్రస్ట్ అధికారులు సిబ్బంది తొలగింపును అడ్డుకున్నారని తెలుస్తోంది. 

ఈ విషయంలో రామ మందిర ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయగా, మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా, గోపాల్ రావులకు కూడా నోటీసులు జారీ చేశారు.రాయ్, మిశ్రాలు ట్రస్టుకు రాజీనామా చేసిన క్రమంలో రావు కూడా ట్రస్టుకు రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మంది కౌంటింగ్ సిబ్బందిని అరెస్టు చేశారు పోలీసులు. ఆలయ విరాళాల పెట్టెల నుండి దొంగిలించబడ్డ సొమ్మును తిరిగి స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు అధికారులు ఆలయ ట్రస్ట్ ఖాతాలను నిర్వహిస్తున్న ఎస్‌బిఐ, విరాళాల నిధులను లెక్కించే పనిని మరో ఏజెన్సీకి అప్పగించింది.

ట్రస్ట్ అధికారుల హస్తం:

సుమారు మూడు నెలల క్రితమే ఆలయ విరాళాల పెట్టెల నుంచి నిధులు పక్కదారి పడుతున్నాయని బ్యాంకుకు అనుమానం వచ్చిందని, అప్పుడే విరాళాల లెక్కింపు విధుల నుంచి సిబ్బందిని తొలగించాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ తొలగింపు ప్రక్రియను ప్రారంభించడానికి కూడా సిద్ధమవుతుండగా, ట్రస్ట్ అధికారులు జోక్యం చేసుకుని సిబ్బందిని సమర్థించి, వారిని తొలగింపు నుంచి కాపాడినట్లు తెలుస్తోంది.

చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల ఆధిపత్యం కారణంగా ఆ సిబ్బందిని తొలగించడంలో బ్యాంకు విఫలమైంది, దీంతో స్కాంకు అడ్డు అదుపు లేకుండా పోయింది

బ్యాంకు సిబ్బంది ప్రమేయం కూడా..

విరాళాల దొంగతనం దర్యాప్తులో రత్నేష్, గగన్‌దీప్ అనే ఇద్దరు బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. విరాళాల లెక్కింపుకి ప్రక్రియను పర్యవేక్షించడానికి వీరు కౌంటింగ్ గదులలో ఉండేవారని... దొంగతనంలో వారి ప్రమేయం ఉన్నట్లు పక్కా ఆధారాలను పోలీసులు సేకరించారని, త్వరలోనే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.