హత్యకు అర్దగంట ముందు ప్రియుడితో సియా సీక్రెట్ కాల్.. కేతన్ హత్యలో మరిన్ని సంచలన విషయాలు

హత్యకు అర్దగంట ముందు ప్రియుడితో సియా సీక్రెట్ కాల్.. కేతన్ హత్యలో మరిన్ని సంచలన విషయాలు

పుణె: మహారాష్ట్రలోని పుణెలో 26 ఏళ్ల రియల్టర్ కేతన్ అగర్వాల్‌‌‌‌ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 18న ప్రముఖ పర్యాటక ప్రాంతం లోహగఢ్ కోటలో వ్యూ పాయింట్ నుంచి కిందపడి కేతన్ మరణించిన విషయం తెలిసిందే. అయితే, కేతన్ ప్రమాదవశాత్తూ పడిపోలేదని, అతడికి కాబోయే భార్య సియా గోయల్ తన ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. తాజాగా ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూశాయి. 

హత్యకు అరగంట ముందు కూడా సియా, చేతన్‎లు ఫోన్‎లో మాట్లాడుకుని తమ ప్లాన్‎ను సమీక్షించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఎంగేజ్ మెంట్ అయ్యాక వివాహం కోసం షాపింగ్ చేయాలంటూ కేతన్ వద్ద నుంచి సియా రూ.కోటి తీసుకుందని, ఆ మొత్తాన్ని తన ప్రియుడు చేతన్‎కు ఇచ్చిందని తెలిపారు. ఇద్దరూ కలిసి కేతన్‏ను చంపేయడానికి నెల రోజుల ముందే ప్లాన్ చేశారని పోలీసులు వివరించారు. 

కేతన్‎ను హత్య చేశాక తాము పట్టుబడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నారని, ఇద్దరూ తమ ఫోన్లలోని మూడు నెలల డాటాను, ఫోన్ కాల్ రికార్డులను డిలీట్ చేశారని వివరించారు. ఈ హడావుడి ముగిశాక మూడేళ్ల పాటు ఒంటరిగా ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలన్నదే సియా, చేతన్​ల ప్లాన్ అని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకుని, సంఘటనా స్థలంలో క్రైమ్ రీకన్‌‌‌‌స్ట్రక్షన్ నిర్వహించి, సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు.

సియా సిగ్నల్.. చేతన్ హత్య

మర్డర్ ప్లాన్​లో భాగంగా కేతన్​ను తీసుకుని సియా ఈ నెల 18 న లోహగఢ్ కోటకు వెళ్లింది. వీరిద్దరినీ బైక్​పై అనుసరిస్తూ చేతన్ కూడా కోటకు చేరుకున్నాడు. కోటపైన నిర్మానుష్యమైన వ్యూ పాయింట్ ను ఎంచుకుని కేతన్​తో పాటు సియా సేదతీరింది. చుట్టూ ఎవరూ గమనించని సమయం చూసి సియా సిగ్నల్ ఇవ్వగా.. చేతన్ వెనక నుంచి వచ్చి కేతన్​ను లోయలోకి తోసేశాడు. హత్యకు 34 నిమిషాల ముందు కూడా సియా, చేతన్‌‌‌‌లు ‘సీక్రెట్ కాల్’ మాట్లాడుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

మరోవైపు, సియా తరఫున లాయర్​ను అంటూ అశుతోష్ శ్రీవాస్తవ మీడియాలో కనిపిస్తుండగా, ఆయనను తాము నియమించుకోలేదని సియా ఫ్యామిలీ స్పష్టం చేసింది. తన సోదరి సంతకాన్ని ఆయన మోసపూరితంగా సేకరించాడని సియా సోదరుడు సాహిల్ చెప్పారు. తాము ఇప్పటికే వేరే లాయర్‌‌‌‌ను నియమించుకున్నామని,  అశుతోష్ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు.