ఇస్లామామాద్: సింధు నది జలాల వివాదంపై పాకిస్థాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్‌ను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల్లో పాకిస్తాన్ నీటి వాటాను లాక్కోవాలని చూసే వారి చేతులను నరికేస్తామని బలుపు కూతలు కూశారు. ఒప్పందం ప్రకారం తమకు కేటాయించిన నీటి వాటాను కాపాడుకోవడానికి పాకిస్తాన్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
పాకిస్తాన్‌కు కేటాయించిన నీటి కేటాయింపులను అడ్డుకోవడానికి భారత్‌ను అనుమతించబోమని పేర్కొన్నారు. ‘‘పొరుగు దేశ ప్రధానమంత్రి (మోడీ) నియంత్రణలో ఒక నీటి కుళాయి ఉంది. పాకిస్థాన్‌లోకి ఒక్క చుక్క నీరు కూడా ప్రవహించనివ్వనని ఆయన అంటున్నారు. కానీ మా నీటిపై చేయి వేస్తే ఆ చేతులను నరికేస్తాం’’ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
ఒప్పందం నిలిపివేయడం సాధ్యం కాదు: అతావుల్లా తరార్
ఇదే అంశంపై పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ మాట్లాడుతూ.. సింధు జలాల ఒప్పందం చట్టబద్ధంగా కట్టుబడి ఉంటుందన్నారు. ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం, రద్దు చేయడం లేదా సవరించడం సాధ్యం కాదన్నారు. సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ వైఖరికి అంతర్జాతీయ మద్దతు లభించిందని ప్రగల్భాలు పలికారు. ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలన్న భారతదేశపు చర్యకు ప్రపంచవ్యాప్తంగా పెద్దగా మద్దతు లభించలేదని నీతులు వల్లించారు.
ఏ దేశం కూడా ఇండియా వైఖరిని అంగీకరించనందున సింధు ఒప్పందం ఇప్పటికీ అమల్లో ఉందని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ నీరే మన జీవనాధారం, అలాగే మన రెడ్ లైన్ అని పదేపదే ప్రకటించారనిగ గుర్తు చేశారు. సింధు నది జలాల ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ హక్కులు అంతర్జాతీయ చట్టం ద్వారా రక్షించబడతాయని అన్నారు. చట్టబద్ధమైన ఒప్పందం ద్వారా పాక్ ప్రజలకు సింధు జలాలపై నీటి హక్కు ఉందని పేర్కొన్నారు.
అసలు వివాదం ఏంటంటే..?
2025, ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడితో సింధు నది జలాల ఒప్పందంపై ఇండియా, పాక్ మధ్య వివాదం మొదలైంది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. దీనికి పాక్ సపోర్ట్ ఉన్న ఉగ్రవాదులే కారణమని భారత్ మండిపడింది. క్రాస్-బోర్డర్ ఉగ్రవాదంపై పాకిస్తాన్ కఠినమైన చర్యలు తీసుకునే వరకు 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
స్వాతంత్ర్యం తర్వాత ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం సుమారు 80 శాతం నీరు పాకిస్తాన్‌కే వెళ్తుంది. ఇది అక్కడి వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు జీవనాడు లాంటిది. ఈ నేపథ్యంలో భారత్ నీటిని నిలిపివేస్తే కోట్లాది మంది ప్రజలు ఇబ్బంది పడతారని, యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి జోక్యం చేసుకోవాలని పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ కోరారు. అలాగే చినాబ్ నది నీటిని మళ్లించేందుకు భారత్ నదుల అనుసంధాన ప్రాజెక్టును నిర్మిస్తోందని కూడా పాక్ ఆందోళన చెందుతోంది.
