మండే ఎండలకు ఫ్రాన్స్ లోనే వెయ్యి మంది ఎందుకు చనిపోయారు..?

మండే ఎండలకు ఫ్రాన్స్ లోనే వెయ్యి మంది ఎందుకు చనిపోయారు..?

హీట్ వేవ్ కారణంగా ఫ్రాన్స్‌‌‌‌లోనే వెయ్యి అదనపు మరణాలు నమోదైనట్టు తెలుస్తోంది. పారిస్ పరిసర ప్రాంతాల్లో మరణాల రేటు వేగంగా పెరుగుతుండటంతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. బుధవారం నుంచి దేశంలో అంచనా వేసిన దానికంటే  మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని, ఇందులో ఎక్కువ శాతం 65 ఏళ్లు పైబడిన వృద్ధులేనని, ఇళ్లలోనే మరణించే వారి సంఖ్య 40శాతం పెరిగిందని డబ్ల్యూహెచ్‌‌‌‌వో తెలిపింది. జర్మనీలో ఓ నర్సింగ్ హోమ్‌‌‌‌ను అత్యవసరంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. 

ఇటలీ, యూకే దేశాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్‌‌‌‌లు జారీ చేశారు. యూరప్‌‌‌‌లో ఏటా ఎండల తీవ్రతకు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం జర్మనీ, పోలెండ్, చెక్ రిపబ్లిక్, హంగేరీలాంటి దేశాల్లో 40 డిగ్రీల పైనే ఎండ మంటలు పుడుతుండటంతో లక్షలాది మంది ప్రజలు అల్లాడిపోతున్నారు. నగరాల్లో జనం నీడ కోసం, ఫౌంటెన్ల వద్ద చల్లదనం కోసం పరుగులు తీస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ముప్పు ఎంత వేగంగా దూసుకొస్తుందో చెప్పడానికి యూరప్ ప్రస్తుత పరిస్థితే సజీవ సాక్ష్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గతం నుంచి యూరప్‌‌‌‌ పాఠాలు నేర్చుకోలేదా..?

2003 నాటి విపత్తు తర్వాత యూరప్‌‌‌‌ దేశాలు మేల్కొన్నాయి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, చర్యల వల్ల మరణాల రేటు కొంత తగ్గింది. ఒక అధ్యయనం ప్రకారం.. 2003 నాటి వడగాడ్పులు ఇప్పుడు వస్తే, అప్పటితో పోలిస్తే మరణాలు 75% తక్కువగా ఉండే అవకాశం ఉంది. సమస్యల్లా వాతావరణ మార్పుల తీవ్రత వేగంగా పెరుగు తుండటమే. 

ఈ ఏడాది మేలోనే బ్రిటన్‌‌‌‌లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డబ్ల్యూహెచ్‌‌‌‌వో యూరప్ చీఫ్ హన్స్ క్లూగే బెర్లిన్‌‌‌‌లో కొత్త గైడ్​లైన్స్​ రిలీజ్​ చేసిన 2 వారాలకే, అక్కడ 40 డిగ్రీల సెల్సియస్ వేడి నమోదైంది. ‘‘ఇదొక పెద్ద విషాదం. 

గత నాలుగేండ్లలో యూరప్‌‌‌‌లో వేడి వల్ల 2 లక్షల మంది చనిపోయారు. ఇందులో మెజారిటీ మరణాలను నివారించవచ్చు. కానీ విఫలమయ్యాం. ఇది కేవలం శాంపిల్‌‌‌‌ మాత్రమే.. భవిష్యత్తులో మిలియన్ల మంది ప్రభావితం అవుతారు’’ అని క్లూగే ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్కిటిక్ మంచు స్పీడ్​గా కరగడం వల్ల యూరప్‌‌‌‌ ఖండం వేగంగా వేడెక్కుతోందని, వాతావరణ మార్పులే ఈ విపత్తుకు కారణమన్నారు.