టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఈసారి జూలై 31 డెడ్‌లైన్ కాదు.. మారిన రూల్స్ తెలుసుకోండి

టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఈసారి జూలై 31 డెడ్‌లైన్ కాదు.. మారిన రూల్స్ తెలుసుకోండి

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసే విషయంలో ప్రతి ఏటా జూలై రాగానే ఒకటే హడావుడి కనిపిస్తుంది. ఇప్పటివరకు అందరికీ జూలై 31 అనేది ఒకే ఒక్క డెడ్‌లైన్‌గా ఉండేది. అయితే అసెస్‌మెంట్ ఇయర్ 2026-27 (ఆర్థిక సంవత్సరం 2025-26) నుంచి ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్ డెడ్‌లైన్ మ్యాప్‌ను పూర్తిగా మార్చేసింది. పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ.. బడ్జెట్ 2026 ద్వారా పన్ను చెల్లింపుదారుల కేటగిరీలను బట్టి ఫైలింగ్ గడువు తేదీల్లో కీలక మార్పులు తీసుకువచ్చింది. కాబట్టి ఈసారి మీ ఐటీఆర్ ఫారమ్‌ను బట్టే మీ రిటర్న్ ఫైలింగ్ చివరి తేదీ ఆధారపడి ఉంటుంది.

కొత్త రూల్స్ ప్రకారం.. జీతాలు తీసుకునే ఉద్యోగులు, పెన్షనర్లు, వడ్డీ లేదా ఒకటి రెండు ఇళ్ల ద్వారా ఆదాయం పొందే పెట్టుబడిదారులు ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 ఫారమ్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. వీరికి ఎప్పటిలాగే 31 జూలై 2026 చివరి తేదీ కొనసాగుతోంది. అయితే ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని వ్యాపారవేత్తలు, ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు, డాక్టర్లు, లాయర్లు వంటి ప్రొఫెషనల్స్ ఐటీఆర్-3 లేదా ఐటీఆర్-4 ఫారమ్‌లను దాఖలు చేయడానికి కేంద్రం ఒక నెల అదనపు సమయాన్ని అందించింది. దీంతో ఈ కేటగిరీ టాక్స్ పేయర్స్ 31 ఆగస్టు 2026 వరకు తమ రిటర్నులను ఎలాంటి పెనాల్టీ లేకుండా సమర్పించవచ్చు. బుక్‌కీపింగ్, అకౌంట్ల పరిశీలన కోసం ఈ అదనపు సమయం వీరికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. సంక్లిష్టమైన ట్యాక్స్ ఆడిట్ కేసులకు 31 అక్టోబర్ 2026, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ కేసులకు 30 నవంబర్ 2026 గడువు తేదీలుగా యథాతథంగా కొనసాగుతాయి.

డెడ్‌లైన్ దాటిన తర్వాత కూడా 31 డిసెంబర్ 2026 వరకు బిలేటెడ్ రిటర్న్ దాఖలు చేసే అవకాశం ఉంది. కానీ దీనికి సెక్షన్ 234F కింద భారీ పెనాల్టీలు చెల్లించుకోవాలి. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1,000, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.5వేలు ఆలస్య రుసుముతో పాటు చెల్లించని పన్నుపై వడ్డీ పడుతుంది. అంతకంటే పెద్ద నష్టం ఏమిటంటే.. లేట్‌గా ఫైల్ చేస్తే పాత పన్ను విధానాన్ని ఎంచుకునే హక్కును కోల్పోతారు. సిస్టమ్ మిమ్మల్ని డిఫాల్ట్‌గా కొత్త పన్ను విధానంలోకి నెట్టేస్తుంది. అంతేకాదు వ్యాపార నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకునే వీలుండదు.

మరో ఆనందకరమైన మార్పు ఏమిటంటే.. రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేసే గడువును కూడా పెంచారు. గతంలో డిసెంబర్ వరకే ఉన్న ఈ విండోను ఇప్పుడు 31 మార్చి 2027 వరకు పొడిగించారు. దీనివల్ల ఏవైనా సెక్షన్ 80C క్లెయిమ్‌లు మిస్ అయినా.. ఏఐఎస్ లో వ్యత్యాసాలు ఉన్నా సరిచేసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది. గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, పాత ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద ఫైల్ చేసే చివరి సీజన్ ఇదే. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 అమల్లోకి వచ్చినప్పటికీ, ఈ ఏడాది పాత ఫారమ్‌లనే వాడాల్సి ఉంటుంది. కాబట్టి గతేడాది పోర్టల్ లోపాల వల్ల గడువు పెరిగిందని నిర్లక్ష్యం చేయకుండా, మీ ఫార్మ్ 16, ఫార్మ్ 26AS లను సరిచూసుకుని, గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేసి 30 రోజుల్లోగా ఈ-వెరిఫై చేసుకోవడం బెస్ట్.