హనుమకొండ సిటీ, వెలుగు: 'సర్' గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి జి.ప్రభాకర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ సీపీఎం ఆఫీస్ లో సోమవారం మూడు పార్టీల జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అనేక మంది ఓటర్లు ఇప్పటికీ తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం పొందలేదన్నారు.
గ్రామీణ ప్రాంతాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో ప్రజలకు తగిన సమాచారం అందకపోవడం, దరఖాస్తుల స్వీకరణలో జాప్యం, సాంకేతిక సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న గడువును మరో ఆరు నెలలు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.చుక్కయ్య, సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ భాష్ మియా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
