బుల్లెట్ ట్రైన్ పనులు స్పీడప్... మార్కింగ్ పనులు చేస్తున్న అధికారులు 

బుల్లెట్ ట్రైన్ పనులు స్పీడప్... మార్కింగ్ పనులు చేస్తున్న అధికారులు 
  • రంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో గుర్తులు వేస్తున్న సర్వే బృందాలు

ఇబ్రహీంపట్నం, వెలుగు :హైదరాబాద్‌‌‌‌-–పుణె, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–-అమరావతి-–చెన్నై బుల్లెట్​ట్రైన్​పనులు స్పీడందుకున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్​-–చెన్నై కారిడార్​కోసం ఫీల్డ్​లెవెల్​లో సిబ్బంది సర్వే చేసి మార్కింగ్​చేస్తున్నారు. రంగారెడ్డి నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు సర్వే బృందాలు వేగంగా మార్కింగ్​వేస్తూ వెళ్తున్నాయి. మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు పది రోజులుగా సర్వే చేస్తున్నారు. 

పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఎరుపు-, తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు. యాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మల్కిజ్​గూడెం, తక్కళ్లపల్లి, చింతపట్ల, నల్ల వెల్లి, మంథన్​ గౌరెల్లి గ్రామాల పరిధిలో ఇప్పటికే మార్కింగ్​పూర్తయ్యింది. కారిడార్ ఎలైన్మెంట్, సర్వే పాయింట్లు, భూసేకరణ అవసరాలను గుర్తించేందుకు ఈ మార్కింగ్​ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. 

హైస్పీడ్ రైలు కారిడార్లకు సంబంధించి ఇప్పటికే ఏరియల్ సర్వే పూర్తయ్యింది. సాధ్యాసాధ్యాల అధ్యయనం కొనసాగుతోంది. సర్వే పూర్తయిన తర్వాత తుది ఎలై న్​మెంట్, స్టేషన్ల స్థానాలు, భూసేకరణ వివరాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.