- భూ నిర్వాసితులకు పరిహారం, పునరావాసం కల్పిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధికి కీలకమని, హైదరాబాద్ రూపురేఖలు మార్చే చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అభివృద్ధితో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మానవీయ కోణంలోనే ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మూసీ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, పునరావాసంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూసీ నది కాలుష్యంతో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
వరదల నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం పెంపు, రోడ్లు, పార్కులు, వాక్‌వేలు ఏర్పాటు చేసి మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రాజెక్టు వల్ల ఇళ్లు కోల్పోయే కుటుంబాలకు వెంటనే డబుల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. అలాగే భూములు కోల్పోయే వారికి చట్టం ప్రకారం పరిహారం, మెరుగైన పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో పేదలకు అన్యాయం జరగదని, ప్రతి నిర్ణయం ప్రజల ప్రయోజనాల దృష్టితోనే తీసుకుంటామని మంత్రి చెప్పారు. భూసేకరణలో కూడా ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
