రాళ్లు రువ్వేవాడు కాదు.. దేశాన్ని నిర్మించేవాడే ‘జెన్ జీ’ :  బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‍

రాళ్లు రువ్వేవాడు కాదు.. దేశాన్ని నిర్మించేవాడే ‘జెన్ జీ’ :  బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‍
  • జీవితంలో షార్ట్‌‌‌‌కట్‌‌‌‌లు ఉండవు.. అంకితభావమే ముఖ్యం
  • కాంగ్రెస్ విద్యా వ్యతిరేక విధానాలపై పోరాడుతాం
  • స్టూడెంట్స్ కాన్ క్లేవ్‌‌‌‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‍

హైదరాబాద్, వెలుగు: ‘జీవితం అనేది వేగాన్ని పరీక్షించే 100 మీటర్ల పరుగు పందెం కాదు. అది సహనాన్ని పరీక్షించే సుదీర్ఘ ప్రయాణం. సక్సెస్‌‌‌‌కు షార్ట్‌‌‌‌కట్‌‌‌‌లు ఉండవు. నిబద్ధతే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‍ అన్నారు. జెన్ జీ అంటే రాళ్లు రువ్వేవాడు కాదనీ, దేశాన్ని నిర్మించేవాడని పేర్కొన్నారు. సోమవారం ఘట్‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌లోని వీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాన్ క్లేవ్‌‌‌‌లో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్​ రావుతో కలిసి ఆయన విద్యార్థులతో మాట్లాడారు.

జెన్‌‌‌‌ జీ అంటే దేశాన్ని ముక్కలు చేయాలని చూసే తుక్డే– తుక్డే గ్యాంగ్ కాదన్నారు. భారతీయ యువత అరాచకత్వాన్ని నమ్మదని, దేశ నిర్మాణాన్ని నమ్ముతుందని విదేశీ అజెండాలను కాపీ కొట్టి, ఇక్కడి యువతను రెచ్చగొట్టాలని చూసే వారు గుర్తుంచుకోవాలన్నారు. గతంలో కశ్మీర్ యువత అంటే రాళ్లు రువ్వేవారే గుర్తొచ్చేవారని, కానీ మోదీ పాలనలో అదే యువత నేడు క్రికెట్ మైదానాల్లో రంజీ ట్రోఫీలు ఆడుతూ దేశం గర్వపడేలా చేస్తున్నారని పేర్కొన్నారు. రెండేళ్లు గడిచినా యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ బకాయిలను క్లియర్ చేయకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని, ఉన్నత విద్యే పునాదిగా బతికే ఎన్నో కుటుంబాలను కాంగ్రెస్ నట్టేట ముంచిందని ఆరోపించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. ప్రధాని మోదీ ఏదైనా హామీ ఇస్తే అది అమలై తీరుతుందని, జన్ ధన్ ఖాతాలే అందుకు నిదర్శనమని చెప్పారు. యువత ఇప్పుడు ఉద్యోగాల కోసం వెతకడం లేదని, పదుల సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, వీబీఐటీ సెక్రెటరీ, బీజేపీ నేత మనోహర్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.