అక్టోబర్ 25న తెలంగాణ– కొరియా సాంస్కృతిక మహోత్సవం

అక్టోబర్ 25న తెలంగాణ– కొరియా సాంస్కృతిక మహోత్సవం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, దక్షిణ కొరియా దేశాల మధ్య పర్యాటక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగుముందుకేసింది. ఈ ఏడాది అక్టోబర్ 25న హైదరాబాద్ వేదికగా ‘తెలంగాణ-–కొరియా సాంస్కృతిక మహోత్సవం’ నిర్వహించేందుకు ఇరు పక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. సోమవారం సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కొరియన్ కల్చరల్ సెంటర్ (కేసీసీఐ) డైరెక్టర్ హ్వాంగ్ ఇల్యాంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ గొప్ప చారిత్రక వారసత్వం, వైవిధ్యభరితమైన సంస్కృతి, సంప్రదాయ కళారూపాలు, ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ప్రతిపాదిత తెలంగాణ-– కొరియా సాంస్కృతిక మహోత్సవం ద్వారా ఇరు ప్రాంతాల కళలు, సంగీతం, నృత్యం, వంటకాలు, సంప్రదాయాలను ఒకే వేదికపై ఆవిష్కరించే అవకాశం లభిస్తుందని తెలిపారు. 

పర్యాటకాభివృద్ధితోపాటు ప్రజల మధ్య స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్సంబంధాలు మరింత పెరుగుతాయ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు. మన దేశ యువతలో కొరియన్ కే-డ్రామాలు, కొరియన్ వినోద కార్యక్రమాలకు ఓటీటీ వేదికల ద్వారా విశేష ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. ఈ సాంస్కృతిక అనుబంధం తెలంగాణ–- కొరియా మధ్య పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించడంతోపాటు సృజనాత్మక భాగస్వామ్యాలకు కొత్త అవకాశాలు కల్పిస్తుందన్నారు.