2026వ సంవత్సరం టెక్ ప్రపంచానికి ఒక 'బ్యాడ్ డ్రీమ్'లా మారింది. టెక్ కంపెనీలు ఒకప్పుడు ఉద్యోగులను ఆహ్వానించడానికి పోటీపడేవి, కానీ ఇప్పుడు వారిని ఇంటికి పంపేయడంలో పోటీ పడుతున్నాయి. గత రెండేళ్లుగా సాగుతున్న ఈ లేఆఫ్స్ ప్రక్రియ ఈ ఏడాది మరింత తీవ్రరూపం దాల్చింది. రోజుకు సగటున 879 మంది ఉద్యోగులు రోడ్డున పడుతుంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం సాధారణ లేఆఫ్స్ కాదు.. ఒక టెక్ సునామీ. ఇప్పటికే ఈ ఏడాది లక్షా 58వేల మంది టెక్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది.
ఈ ఉద్యోగాల కోతకు ప్రధాన కారణం ఏఐ. కంపెనీలు ఇప్పుడు మనుషుల కంటే ఏఐ అల్గారిథమ్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. కోడింగ్, కస్టమర్ సపోర్ట్, కంటెంట్ క్రియేషన్, క్వాలిటీ అస్యూరెన్స్ వంటి కీలక విభాగాలు ఇప్పుడు ఏఐ చేతిలోకి వెళ్లిపోతున్నాయి. ఫలితంగా ఇంటెల్, మైక్రోసాఫ్ట్, పేపాల్ వంటి టెక్ దిగ్గజాలు భారీగా వర్క్‌ఫోర్స్‌ను తగ్గిస్తున్నాయి. ఇంటెల్ ఏకంగా 24వేల మంది ఉద్యోగులను తొలగించి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. మైక్రోసాఫ్ట్ 15వేల మందితో రెండో స్థానంలో ఉండగా.. పేపాల్, సిస్కో, క్లౌడ్‌ఫ్లేర్, లింక్డ్‌ఇన్ వంటి కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపేశాయి. కంపెనీలు ఇప్పుడున్న మనుషులపై ఖర్చు తగ్గించి, ఆ పెట్టుబడులను ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల విస్తరణ కోసం మళ్లిస్తున్నాయి.
అయితే ఈ లేఆఫ్స్ ప్రకంపనలు కేవలం టెక్ రంగానికే పరిమితం కాలేదు. ఇప్పుడు ఇది సంప్రదాయ రంగాలను కూడా తాకుతోంది. సిగరెట్ దిగ్గజం 'బ్రిటిష్ అమెరికన్ టొబాకో' కూడా బాంబు పేల్చింది. ఏకంగా 5,500 మంది ఉద్యోగులను గ్లోబల్‌గా తొలగిస్తున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసింది. సాధారణ సిగరెట్లకు డిమాండ్ తగ్గడం, వేపింగ్ వంటి కొత్త ప్రత్యామ్నాయాల వైపు కంపెనీ మొగ్గు చూపడం ఈ తొలగింపులకు ప్రధాన కారణం. దాదాపు 20 శాతం మంది సిబ్బందిని తొలగించడం ద్వారా 2028 నాటికి భారీగా ఖర్చులను తగ్గించుకోవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
2026వ సంవత్సరం టెక్నాలజీలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్న కాలం, కానీ అదే సమయంలో సామాన్య ఉద్యోగులకు ఒక పెద్ద సవాల్‌గా మారింది. సంస్థలు కేవలం లాభాలు, ఆటోమేషన్ వైపు మాత్రమే చూస్తుండటంతో, స్కిల్స్ లేని వారు ఈ సునామీలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అప్‌స్కిల్లింగ్ మాత్రమే ఇప్పుడున్న ఏకైక రక్షణ. ఈ లేఆఫ్స్ యుద్ధంలో ఎవరు నిలబడతారు, ఎవరు కనుమరుగవుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న. మనుషుల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తోన్న ఈ కొత్త శకంలో జాబ్ సేఫ్టీ అనేది ఒక మిస్టరీగా మారిపోయిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
