హైదరాబాద్‌లో జూన్ 30న తెల్లవారుజామున భారీ పేలుడు కలకలం రేపింది. సరూర్‌నగర్ పరిధిలోని బాబూనగర్‌లో ఉన్న ఓ ఇంట్లో ఒక్కసారిగా సంభవించిన భారీ పేలుడు ధాటికి ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.
రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్‌కు చెందిన ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సంభవించిన సమయంలో కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నారు. అయితే, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
నిజానికి ఈ ప్రమాదంలో మరింత పెద్ద విపత్తు తృటిలో తప్పిందని చెప్పాలి. పేలుడు జరిగిన సమయంలో ఇంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఒకవేళ ఆ సిలిండర్లు కూడా పేలి ఉంటే ఊహించని ప్రమాదం జరిగి ఉండేది. కానీ అవి సురక్షితంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఈ భారీ పేలుడుకు గల అసలు కారణాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
