కొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువా 

కొండగట్టు అంజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు శాలువా 

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారికి ఓ అరుదైన కానుక అందింది.రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్.. స్వామివారి కోసం అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత సూక్ష్మంగా ఓ అద్భుత పట్టు శాలువాను నేశారు. అత్యంత సన్నని దారాలతో, ఎంతో శ్రమించి రూపొందించిన ఈ చేనేత కళాఖండం చూసే ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. కొండగట్టుకు చేరుకున్న హరిప్రసాద్.. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ పట్టు శాలువాను భక్తిపూర్వకంగా ఆలయ అధికారులకు అందజేశారు.

ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఆ శ్రీ ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతోనే ఈ అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించగలిగానని ఆనందం వ్యక్తం చేశారు. సిరిసిల్ల చేనేత కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ అరుదైన పట్టు శాలువాను చూసి, హరిప్రసాద్ అసాధారణ ప్రతిభను ఆలయ అధికారులు ,భక్తులు ముక్తకంఠంతో అభినందించారు.