చెన్నై: తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో పోటీపై ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్ రాఘవ లారెన్స్ క్లారిటీ ఇచ్చారు. తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో తాను పోటీ చేయడం లేదని కుండబద్దలు కొట్టారు. తద్వారా తన పోటీపై వస్తోన్న ఊహాగానాలకు లారెన్స్ తెరదించారు. తిరుచ్చి ఈస్ట్‌లో తాను పోటీ చేయడం ధర్మం కాదని లారెన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
టీవీకే విజయం, విజయ్ను సీఎం చేయడం కోసం కార్యకర్తలు తీవ్రంగా కృషి చేశారని.. పార్టీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే ఈ అవకాశం దక్కాలని అన్నారు. అయితే తాను తిరుచ్చి నుంచి మాత్రమే తప్పుకుంటున్నానని.. భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నుంచి ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
ప్రజలకు సేవ చేసేందుకు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అయితే, ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. ఏ పార్టీలో గౌరవం ఉంటుందో ఆ పార్టీలోనే చేరుతానని స్పష్టం చేశారు. నేను క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందే కొందరు తనపై విమర్శలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తిరుచ్చి ఈస్ట్‌కు ఉప ఎన్నిక ఎందుకంటే..?
2026, ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్ని్కల్లో టీవీకే చీఫ్ విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు స్థానాల్లో విజయ్ ఘన విజయం సాధించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించాలి.
ALSO READ : సీఎం రేవంత్ ను కలిసిన తెలంగాణ కొత్త సీఎస్ సంజయ్ జాజు
ఈ నేపథ్యంలో విజయ్ తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. దీంతో తిరుచ్చి ఈస్ట్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే తిరుచ్చి నుంచి టీవీకే తరుఫున లారెన్స్ బరిలోకి దిగుతారని తమిళ పాలిటిక్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తిరుచ్చి నుంచి తాను పోటీ చేయడం లేదని ప్రకటించి ఈ ఊహాగానాలకు లారెన్స్ తెరదించారు.
