హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రమైన నగరంగా, ట్రాఫిక్ సమస్యలు లేని సిటీగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జూబ్లీహిల్స్ నివాసంలో మున్సిపల్ అధికారులతో సీఎం వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంతో పాటు నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. మున్సిపల్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను విస్తరించాలి
నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ తదితర అవసరాలకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా ప్రజలకు, సంబంధిత సంస్థలకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. నిర్మాణ రంగం, గ్రీనరీ నిర్వహణ, పార్కుల అభివృద్ధి కోసం తాగునీటిని వినియోగించకుండా, ప్రత్యామ్నాయంగా ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని ఉపయోగించాలని అభిప్రాయపడ్డారు. దీనివల్ల తాగునీటిని ఆదా చేయవచ్చన్నారు.
జలమండలి తొలివిడతలో 19 మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తుచేశారు. జీహెచ్ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో గ్రీన్ వాటర్ సరఫరాను మరింత విస్తరించాలని అధికారులను ఆదేశించారు.
సిగ్నల్ ఫ్రీ ట్రాఫిక్ కోసం ప్రత్యేక ప్రణాళికలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపి నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలు నిలిచిపోకుండా, రాకపోకలు నిరంతరాయంగా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నగరంలో పారిశుద్ధ్యం, నీటి వినియోగం, ట్రాఫిక్ నిర్వహణ అంశాలపై సమన్వయంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డితో పాటు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
