జిల్లాల్లోనే 90 శాతం మందికి వైద్య సేవలు: మంత్రి దామోదర

జిల్లాల్లోనే 90 శాతం మందికి వైద్య సేవలు: మంత్రి దామోదర

తెలంగాణలోని కనీసం 90 శాతం మంది రోగులకు వారి జిల్లాల్లోనే మెరుగైన వైద్య సేవలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇందుకోసం గత మూడేళ్లలో వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు సహా ఆరోగ్యశాఖలో సుమారు 15 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. డీఎస్‌హెచ్‌ పరిధిలోని ఆస్పత్రుల్లో ఇటీవల 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించినట్లు వివరించారు.కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాలు, సమకూర్చనున్న వైద్య పరికరాలను సమర్థంగా వినియోగించుకుంటూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారులు (డీసీహెచ్‌ఎస్‌), ఆస్పత్రి సూపరింటెండెంట్లకు సూచించారు.

సెకండరీ హెల్త్‌కేర్ డైరెక్టరేట్ (డీఎస్‌హెచ్‌) పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల భవన నిర్మాణ పనుల పురోగతిపై  మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి భవనాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9 ఆస్పత్రి భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. డిసెంబర్ 2026 నాటికి మరో 14 భవనాలు, 2027 మార్చి నాటికి మరో 11 భవనాల నిర్మాణం పూర్తి కానున్నట్లు తెలిపారు. మరో 45 భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వెల్లడించారు.

ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 9 ఆస్పత్రి భవనాల్లో అవసరమైన వైద్య పరికరాలు, ఫర్నీచర్‌ను వెంటనే ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. డిసెంబర్, 2027 మార్చి నాటికి పూర్తికానున్న భవనాలకు అవసరమైన ఎక్విప్‌మెంట్, ఫర్నీచర్ కొనుగోలు ప్రక్రియను ఇప్పుడే ప్రారంభించాలని సూచించారు. డీఎస్‌హెచ్‌ పరిధిలో నిర్మాణంలో ఉన్న అన్ని ఆస్పత్రి భవనాలను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఎల్‌నినో నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఆస్పత్రుల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రుల్లో తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.