‘‘ఆ పూణే అబ్బాయికి జుట్టు లేదు. ఇలాంటి అబద్ధాలు చెబితే చచ్చిపోతారు’’.. లేడీ డెంటిస్ట్ వీడియో వైరల్

‘‘ఆ పూణే అబ్బాయికి జుట్టు లేదు. ఇలాంటి అబద్ధాలు చెబితే చచ్చిపోతారు’’.. లేడీ డెంటిస్ట్ వీడియో వైరల్

సమాజంలో రోజూ ఎన్నో నేరాలుఘోరాలు జరుగుతుంటాయి. ప్రతీ అంశంపై మనం స్పందించాల్సిన అవసరం లేదు. స్పందించకూడదని ఆంక్షలు కూడా ఏం లేవు. అయితే.. సున్నితమైన అంశాలపై స్పందించే సందర్భంలో విచక్షణ మర్చిపోతేనే వివాదాలు చుట్టుముడతాయి. ఒక్కోసారి ఉద్యోగం కూడా ఊడిపోతుంది. జబల్పూర్లో ఒక లేడీ డెంటిస్ట్ విషయంలో ఇదే జరిగింది.

జబల్‌పూర్‌కు చెందిన దంత వైద్యురాలు డాక్టర్ ముస్కాన్ సోనీ.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్యపై స్పందించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందించిన తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అంత సున్నితమైన అంశంపై, కేతన్ హత్యను అపహాస్యం చేస్తూ ముస్కాన్ చేసిన అపహాస్యపు వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో All India Dental Students and Surgeons Association (AIDSA) జబల్‌పూర్‌కు చెందిన దంత వైద్యురాలు డాక్టర్ ముస్కాన్ సోనీని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది.

ఆమె ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ.. AIDSA ఆమెను కోశాధికారి, సభ్యత్వ పదవుల నుంచి తొలగించింది. ఆ తర్వాత సోనీ పశ్చాతాపం వ్యక్తం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తాను ఉపయోగించిన పదాలకు చాలా చాలా చింతిస్తున్నానని చెబుతూ ముస్కాన్ సోనీ క్షమాపణ చెప్పింది. అయితే.. "నాకు పురుషులంటే ద్వేషం" అని ఆమె చేసిన వ్యాఖ్యలను ముస్కాన్ సోనీ ఇప్పటికీ సమర్థించుకోవడం గమనార్హం.

ALSO READ : 2026లో టెక్కీలను వణికిస్తున్న ఏఐ సునామీ..

ఇంతకీ.. కేతన్ అగర్వాల్ హత్యపై ముస్కాన్ సోనీ చేసిన వ్యాఖ్యలేంటంటే.. “ఆ పూణే అబ్బాయికి జుట్టు లేదు. మీరు ఇలాంటి అబద్ధాలు చెబితే కచ్చితంగా చచ్చిపోతారు..అందుకే ‘నాకు మగవాళ్ళంటే ద్వేషం’” అని చెప్పింది. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కేతన్ అగర్వాల్కు బట్టతల ఉందని.. విగ్గు పెట్టుకున్నాడని.. చంపడానికి ఇది కూడా ఒక కారణం అని సియా గోయల్ చెప్పినట్లుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మధ్యప్రదేశ్కు చెందిన మహిళా డెంటిస్ట్ ముస్కాన్ సోనీ.. కేతన్ అగర్వాల్ హత్యపై స్పందించి అభాసుపాలైంది.