లక్నో: అయోధ్య రామ మందిర విరాళాల గోల్ మాల్, నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ (VHP) అగ్రనేత చంపత్ రాయ్ శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంపత్ రాయ్, అయోధ్య రామ మందిర విరాళాల అక్రమాల ఇష్యూపై విశ్వ హిందూ పరిషత్ స్పందించింది.
ఈ మేరకు వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర ట్రస్ట్ మాజీ చీఫ్ చంపత్ రాయ్ నిర్ణయాలకు వీహెచ్‌పీ బాధ్యత వహించదని తెలిపారు. ఆ స్థలంలో రామాలయం నిర్మించాలనే లక్ష్యం నెరవేరడంతో రామ జన్మభూమి ఉద్యమంలో వీహెచ్‌పీ పాత్ర ముగిసిందని ఆయన స్పష్టం చేశారు.
‘‘అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో మా పాత్ర ముగిసింది. దేశంలో ఎక్కడైనా దేవాలయాలను నిర్మించడం లేదా వాటిని నిర్వహించడం వీహెచ్‌పీ పని కాదు. వాటిని ట్రస్టే నిర్వహిస్తుంది. ఆలయ నిర్వహణలో ఏం జరిగినా ట్రస్ట్దే బాధ్యత అవుతుంది’’ అని స్పష్టం చేశారు.
అయోధ్య విరాళాల అక్రమాల వ్యవహారంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు లేదా ప్రభుత్వానికి వీహెచ్‌పీని జవాబుదారిగా చేయడం అనుచితమని అన్నారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి హోదాలో తమ సంస్థ అగ్రనేత చంపత్ రాయ్ తీసుకున్న చర్యల విషయంలో వీహెచ్‌పీ దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు.
