Makutam: ఏడాది పాటు పర్సనల్ లైఫ్‌ను మరిచిపోయా.. దర్శకుడిగా విశాల్ ఎమోషనల్

Makutam: ఏడాది పాటు పర్సనల్ లైఫ్‌ను మరిచిపోయా.. దర్శకుడిగా విశాల్ ఎమోషనల్

విశాల్ హీరోగా, దర్శకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమాను స్వర్గీయ ఆర్.బి. చౌదరి నిర్మిస్తున్నారు. అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం నుండి తాజాగా రెండో పాట ‘నచ్చాకే వచ్చేరా’ను విడుదల చేసిన సందర్భంగా చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ, ‘మకుటం’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఆర్జీవీ ‘శివ’ సినిమా చూసినప్పటి నుండి డైరెక్టర్ అవ్వాలనే తన కోరిక ఇప్పటికి నెరవేరిందని చెప్పారు. నాపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ఆర్.బి. చౌదరి గారిని మిస్ అవుతున్నానని, ఈ ప్రాజెక్ట్ కోసం ఏడాది పాటు పర్సనల్ విషయాలను పక్కనపెట్టి కష్టపడ్డానని తెలిపారు. జీవీ ప్రకాష్ అందించిన మ్యూజిక్, ప్రభ పాడిన ఈ రెండో పాట చాలా బాగా వచ్చాయని, ‘పందెంకోడి’ నుండి ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాతో ఒక మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తానని నమ్మకం వ్యక్తం చేశారు.

హీరోయిన్ అంజలి మాట్లాడుతూ, విశాల్‌తో తనకు 15 ఏళ్ల అనుబంధం ఉందని, ఈ సినిమాలో తన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పారు. విశాల్ హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా ఈ సినిమాతో పెద్ద విజయం అందుకోవాలని కోరుకున్నారు. నిర్మాత ఆర్.బి. చౌదరి కుమారుడు జితన్ రమేష్ మాట్లాడుతూ, విశాల్ తమ కుటుంబ సభ్యుడి లాంటివాడని, తమ బ్యానర్ నుంచి 99వ చిత్రంగా వస్తున్న ‘మకుటం’ పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నామన్నారు. భవిష్యత్తులో తమ నాన్నగారి లెగసీని కంటిన్యూ చేస్తూ మరిన్ని చిత్రాలు నిర్మిస్తామని తెలిపారు.

నటులు అజయ్, ఝాన్సీలు మాట్లాడుతూ, దర్శకుడిగా విశాల్ ఈ చిత్రంతో అద్భుతం క్రియేట్ చేయబోతున్నారని, ఇందులో తమ పాత్రలు చాలా కొత్తగా ఉంటాయని చెప్పారు. సింగర్ ప్రభ తనకు సినిమాలో మొదటిసారి పాట పాడే అవకాశం ఇచ్చిన విశాల్, జీవీ ప్రకాష్‌లకు ధన్యవాదాలు తెలిపారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.