స్టూడెంట్స్‎కు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్: ఇక అడ్వాన్స్‎గా ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్

స్టూడెంట్స్‎కు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్: ఇక అడ్వాన్స్‎గా ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్
  • బ్యాంకుల వద్ద రూ.250 కోట్లు పెట్టాం: సీఎం రేవంత్ రెడ్డి 
  • విద్యార్థులు ఎవరి దగ్గరా చేయిచాచాల్సిన పనిలేదు
  • ఏటా రూ.2,400 కోట్లు స్టూడెంట్ల ఖాతాల్లో వేస్తాం
  • బహుజన బిడ్డలు డాక్టర్లు, ఐఏఎస్‌‌‌‌లే కాదు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలి
  • గత పాలకులు యువతను గొర్రెలు, బర్రెలకే పరిమితం చేయాలనుకున్నరు 
  • మేం ధైర్యంగా ఎస్సీ వర్గీకరణ అమలు పరుస్తున్నాం
  • వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో బీసీ కులగణన చేశాం
  • కుల నిర్మూలన లక్ష్యంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్‌‌‌‌ స్కూళ్లు 
  • నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తాం 
  • జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాల 
  • ఆవిష్కరణ సభలో సీఎం

హైదరాబాద్, వెలుగు: ఇకపై విద్యార్థులు అడగకముందే వారి ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్​పైసలు వేస్తామని, ఇందుకోసం ఏటా రూ.2,400 కోట్లను అందుబాటులో ఉంచుతామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. ‘‘ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ కోసం విద్యార్థులు ఇకపై ఎవరి దగ్గరా చేయి చాచాల్సిన అవసరం లేదు. ఈ అకడమిక్ ఇయర్ నుంచి తొలి విడత ఫీజుల చెల్లింపు కోసం ఇప్పటికే రూ.250 కోట్లను బ్యాంకుల వద్ద అడ్వాన్స్‌‌‌‌గా పెట్టాం’’అని వెల్లడించారు. 

శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రీ బాయి ఫూలే దంపతుల విగ్రహాలను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘అడ్మిషన్లు తీసుకున్న వెంటనే ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్లై చేసుకోండి.. నెల వ్యవధిలో మీ ఖాతాలో మీ ఫీజు డబ్బులు పడతాయి. ఎవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఏ కాలేజీ కూడా మీరు ఫీజులు కట్టలేదని మీ సర్టిఫికెట్లు ఆపే అవకాశం ఇవ్వం. ఈ సంవత్సరం నుంచి ప్రతి రూపాయి అడగకముందే మీ ఖాతాలో వేస్తాం’’ అని సీఎం చెప్పారు.

కేవలం చదువుకోవడం, ఉద్యోగాలు సాధించడమే కాకుండా విద్యార్థులు, యువత సామాజిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందించుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. ‘‘రాజ్యాధికారంలో బలహీన వర్గాలు భాగస్వాములు కావాలి. మన తాతలు, తండ్రులు కష్టపడి గొర్రెలు కాసి, చెప్పులు కుట్టి మనల్ని బడులకు పంపారు. మన తరం కూడా ఇంకా అవే పనులు చేసుకుంటూ ఉండిపోకూడదు.

మన బహుజన బిడ్డలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావడం మాత్రమే కాదు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయి చట్టసభల్లోకి అడుగుపెట్టాలి. పరిపాలనలో భాగస్వాములు కావాలి. అప్పుడే మన సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. సమాజంలో సంపూర్ణ సమానత్వం సాధ్యమవుతుంది. అందుకే, మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ, మిమ్మల్ని అన్ని రంగాల్లో ముందడుగు వేయించడానికి అవసరమైన అన్ని రకాల వసతులు, నాణ్యమైన విద్యను అందించే బాధ్యతను మీ రేవంతన్నగా నేను తీసుకుంటాను” అని సీఎం తెలిపారు. 

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేలా చేశాం.. 

మాదిగ, మాదిగ ఉపకులాల 30, 40 ఏళ్ల ధర్మ పోరాటానికి మద్దతుగా దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణను తాము అమలు చేసి చూపించామని సీఎం రేవంత్ అన్నారు. దేశంలో వందేళ్ల తర్వాత ఎంతో ధైర్యంతో, పారదర్శకంగా బీసీ కులగణన చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన సర్వేను 2025 ఫిబ్రవరి నాటికి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. 

ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ‘సామాజిక న్యాయ దినోత్సవం’గా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. కులగణన వల్ల బీసీలకు జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలు, రాజ్యాంగ ఫలాలు నిష్పాక్షికంగా అందుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టక తప్పని పరిస్థితిని తెలంగాణ నమూనా కల్పించిందని సీఎం చెప్పారు.

రాష్ట్రంలో కుల నిర్మూలన, సామాజిక సమగ్రతే లక్ష్యంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టామన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వేర్వేరుగా ఉన్న గురుకులాల స్థానంలో అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునేలా, ఒకే దగ్గర కలసి భోజనం చేసేలా ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నర్సరీ నుంచి12వ తరగతి వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి, నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, కాస్మోటిక్, డైట్ చార్జీలను భారీగా పెంచామని తెలిపారు. 

స్కిల్స్ పెంచుకోవాలి.. 

నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలకు ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి సంప్రదాయ డిగ్రీ పట్టాలు మాత్రమే సరిపోవని, సాంకేతిక నైపుణ్యాలే కీలకమని సీఎం స్పష్టం చేశారు. కేవలం సర్టిఫికెట్లు ఉన్నంత మాత్రాన ఉపాధి లభించదని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రభావంతో సాంకేతిక రంగంలో వచ్చే మార్పులను తట్టుకునేలా యువత తయారవ్వాలని సూచించారు.

ఇందుకోసం119 నియోజకవర్గాల్లో టాటా సంస్థ భాగస్వామ్యంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను(ఏటీసీ) ప్రారంభించామని తెలిపారు. ఏటీసీలలో శిక్షణ పొందే విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్టైఫండ్ అందిస్తూ.. జర్మన్, జపనీస్ వంటి విదేశీ భాషలతో పాటు గ్లోబల్ స్కిల్స్ నేర్పిస్తున్నామన్నారు. నర్సింగ్ పూర్తి చేసిన ఆడపిల్లలకు జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో రూ.2 లక్షల వేతనంతో ఉద్యోగాలు సాధించేలా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని హామీ ఇచ్చారు. 

క్రీడా రంగానికి అత్యున్నత ప్రాధాన్యం

విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు చదువుతో పాటు క్రీడా రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నామని.. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడాకారులకు నిలయంగా తెలంగాణను మారుస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను ప్రోత్సహించేందుకుగాను పతకాలు సాధించిన వారికి కోట్ల రూపాయల నజరానాలతో పాటు నేరుగా గ్రూప్-1, గ్రూప్-2 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు.

బాక్సింగ్ ఛాంపియన్ నికత్ జరీన్‌‌‌‌కు డీఎస్పీగా, క్రికెటర్ సిరాజ్‌‌‌‌కు, ఒలింపిక్ మెడలిస్ట్ దీప్తి జీవాంజికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లో ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను మించి ఏకంగా 60 శాతం ఉద్యోగాలను బీసీ, బలహీన వర్గాల బిడ్డలే సాధించి కొత్త చరిత్ర సృష్టించారని సీఎం కొనియాడారు.