- ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్‌తో రైజింగ్ గ్లోబల్ సమిట్ 2.0
- డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించేందుకు నిర్ణయం
- స్కిల్స్ వర్సిటీ పరిధిలోకి ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు
- 15 టీఎంసీలకు గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు కెపాసిటీ
- మరో 7 యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆమోదం
- అక్టోబర్ 31 వరకు హిల్ట్ పాలసీ దరఖాస్తుల గడువు
- కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, అడ్లూరి
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ అనే థీమ్‌తో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2.0’ను నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ సమిట్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. సదస్సు నిర్వహణకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామితో కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు పలు సబ్‌కమిటీలు వేయనున్నారు. ఫ్యూచర్ సిటీ ప్లాన్‌ను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో ఉన్న అపార అవకాశాలను చాటేలా సదస్సు నిర్వహించాలని, రాష్ట్ర స్టార్టప్‌లు, పారిశ్రామిక ఆవిష్కరణలతో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమావేశమైన కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ సచివాలయంలో మీడియాకు వెల్లడించారు. నిషేధిత జాబితా భూములపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారని, ప్రభుత్వ, లిటిగేషన్ భూములు మినహా మిగతా భూములు, ఇండ్లు ప్రొహిబిషన్ లిస్టులో ఉంటే వాటిని తొలగిస్తామని, దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని మంత్రులు తెలిపారు.
18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలు ఈవీలుగా..
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) పరిధిలో కాలుష్యాన్ని అరికట్టేందుకు రూ. 200 కోట్లతో ‘తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్’ అమలుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రులు తెలిపారు. నగరంలోని 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలను ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్స్)లుగా మార్చనున్నట్టు వెల్లడించారు. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1,50,000 సబ్సిడీ ఇస్తామన్నారు. ఈ నిధులతో డ్రైవర్లు ఈవీ కిట్ అమర్చుకోవచ్చని లేదంటే పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త ఈవీ ఆటో కొనుక్కోవచ్చన్నారు. నగర పరిధిలోని కాలుష్య కారక పరిశ్రమలను శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన హిల్ట్ పాలసీ దరఖాస్తుల గడువును అక్టోబర్ 31 వరకు పొడిగించినట్లు మంత్రులు తెలిపారు.
శక్తి శాఖలోకి స్కిల్స్ యూనివర్సిటీ
యువతకు విద్యారంగంలో ఆధునిక నైపుణ్యాలు అందించేలా సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను ఇకపై యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. వీటిని తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి తొలగించి స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి చేరుస్తారని, ఇప్పటివరకు పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న ఈ సంస్థలన్నింటినీ శక్తి (కార్మిక) శాఖ పరిధిలోకి తెస్తామని చెప్పారు.
కొత్తగా ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోథ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు. దీంతో అనుమతులు లభించిన బడుల సంఖ్య 86కు చేరిందన్నారు. మిగిలిన చోట్ల స్థల సేకరణ చేసి, నిర్మాణంలో ఉన్న వాటిని వేగంగా పూర్తిచేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.
వేలానికి17.54 లక్షల టన్నుల మిగులు ధాన్యం
వానాకాలం సీజన్‌లో 7 రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు గ్రామ పంచాయతీలు, రైతు వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని, ఈ ఏడు రకాల సన్నాలకే క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని కేబినెట్ తీర్మానించినట్లు మంత్రులు చెప్పారు. యాసంగిలో 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 63.62 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా, మిగిలిన 17.54 లక్షల మెట్రిక్ టన్నుల మిగులు ధాన్యానికి మొక్కజొన్నల తరహాలో ఈ–వేలం వేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని, క్వింటాలుకు రూ. 2,389 బేసిక్ ప్రైస్ నిర్ణయించిందని తెలిపారు.
గూడెందొడ్డి దగ్గర సోలార్ విద్యుత్ ఉత్పత్తి
సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి మక్తల్- నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్- 2 పనుల కోసం రూ.2,100 కోట్ల అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రులు తెలిపారు. ఈ స్కీమ్ వల్ల దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీటితో పాటు తాగు నీరు, పారిశ్రామిక అవసరాలు తీరుతాయ న్నారు. వీటితో పాటు గూడెందొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచడంతో పాటు అక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్‌ను నియమించనున్నట్టు తెలిపారు. కాగా, రేషన్ కార్డుదారులకు శనివారం స్మార్ట్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రులు వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం కొత్తగా 62 లక్షల మందికి లబ్ధి చేకూర్చడంతో ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3.42 కోట్లకు చేరిందన్నారు.
