హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు లోబడే శ్రీశైలం నీటిని వాడుకుంటున్నామని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల సమస్యలను పరిష్కరించుకోవడానికి కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశాలు ఎంతో కీలకమన్నారు. ఏపీ, తెలంగాణల మధ్య 66:34 నిష్పత్తిలోనే నీటి పంపకాలు జరగాలన్నారు. ఈ విషయంలో ఏపీ వైపు నుంచి ఉన్న అభ్యంతరాలను ఇప్పటికే ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.
అలాగే, గోదావరి– కావేరి నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలన్నారు. శుక్రవారం వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరులోగా వెలిగొండ, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాళ్లను ప్రారంభించి నీరందిస్తామని తెలిపారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు వెలిగొండ నిర్వాసితులకు పెండింగ్ పరిహారం రూ.600 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో 77 శాతం పనులు పూర్తయ్యాయని, ఆ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగానూ తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
పోలవరం నుంచి భద్రాచలం వరకు నదీ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన అని తెలిపారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నీటిని ఈ నెలాఖరులోగా అనకాపల్లికి తీసుకెళ్తామని చెప్పారు. డేటా సెంటర్లు, ఇతర పారిశ్రామిక అవసరాలకు 3 టీఎంసీల నీటిని లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా అందిస్తే సరిపోతుందని తెలిపారు. రానున్న రోజుల్లో 36 ప్రాజెక్టులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా తాగునీటికి మాత్రమే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.
