తిరుమల గిరులు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గత కొద్ది రోజులుగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా... తాజాగా రద్దీ మరింత పెరిగింది...శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వరకు కొనసాగుతున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. పెరటాసి మాసం మూడో వారం కావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోగా... క్యూలైన్లు గోగర్భం డ్యామ్ చేరుకున్నాయి. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల వరకు సమయం పడుతోంది. పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం సర్వదర్శనం భక్తులను పాచికాలువ ఆలయం నుంచి బాట గంగమ్మ ఆలయం దగ్గర క్యూలైన్‌లోకి అనుమతిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల వరకు సమయం పడుతోంది.
క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తులకు నిరంతరాయంగా అల్పాహారం, తాగునీరు, పాలు అందిస్తోంది. రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల నిర్వహణతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోంది.
మరోవైపు భారీ రద్దీ నేపథ్యంలో దర్శనాల విషయంలోనూ టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 5న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలకు వచ్చే యాత్రికులు టీటీడీ సూచనలు, దర్శన సమయాలను ముందుగానే తెలుసుకుని తమ ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
