జెన్ జీ నిరసనల్లో పెద్ద గాయాలు కాలే : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు

జెన్ జీ నిరసనల్లో పెద్ద గాయాలు కాలే : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
  •     కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ
  •     పెల్లెట్ గన్స్ వాడితే వందలాది మంది గాయపడేటోళ్లని వెల్లడి

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ పై జులై 20న ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలో నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వాడారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. భద్రతా బలగాలు పెల్లెట్ గన్స్ ప్రయోగించి ఉంటే వేల మంది పాల్గొన్న నిరసనలో వందలాది మందికి గాయాలయ్యేవి కదా అని ప్రశ్నించారు. 

జెన్ జీ స్టూడెంట్ల నిరసనల్లో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని.. ప్రతిపక్షాల విమర్శల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంట్ మార్చ్ సందర్భంగా సుమారు 30 నుంచి 40 వేల మంది దూసుకొచ్చారు. వాళ్లు పార్లమెంటు వైపు వెళ్లకుండా అడ్డుకోవడం, శాంతిభద్రతలను కాపాడటం పోలీసుల ప్రాథమిక విధి. ఆ సమయంలో సమూహాన్ని కంట్రోల్ చేయటానికి తగిన చర్యలు తీసుకోవడమనేది పోలీసుల బాధ్యత. నిరసనకారులను చెదరగొట్టడమే భద్రతా బలగాల లక్ష్యం. ఒక వేళ పెల్లెట్ గన్స్ ప్రయోగించి ఉంటే గాయపడినవారి సంఖ్య భారీగా ఉండేది. పెల్లెట్ గన్‌లలో పెల్లెట్లు ఉంటాయి. అవి బుల్లెట్లు కాదు. 

కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే గాయపడ్డాడు. దాన్ని మాత్రమే మనం పరిశీలించాలి. వేలాది మంది పాల్గొన్న నిరసనల్లో పెల్లెట్ గన్స్ వాడితే వందలాది మంది గాయపడాలి కదా!’ అని కిరణ్ రిజిజు తెలిపారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని..పార్లమెంటు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు అంగీకరిస్తే విద్యార్థుల నిరసనలపై అమిత్ షా వివరణ ఇస్తారని రిజిజు స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కాశ్మీర్‌లో పెల్లెట్ గన్‌లను విస్త్రృతంగా వాడారని గుర్తుచేశారు. పెల్లెట్ గన్‌ల వాడకం రద్దు అంశంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని.. న్యాయస్థానం విచారణ జరిపే వరకు దీనిపై తాము ఏం మాట్లాడలేమని రిజిజు పేర్కొన్నారు.