Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’లో వెంకటేష్.. ఈ క్రేజీ కాంబో వెనుక స్నేహమా? భారీ రెమ్యునరేషనా?

Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’లో వెంకటేష్.. ఈ క్రేజీ కాంబో వెనుక స్నేహమా? భారీ రెమ్యునరేషనా?

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో అజిత్ మరోసారి చేతులు కలిపారు. ఈ చిత్రానికి తాజాగా ‘డేర్ డెవిల్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీంతో అజిత్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అజిత్ కెరీర్‌లో ఇది 64వ చిత్రం (AK64).

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ తర్వాత అజిత్–అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడం విశేషం. అయితే ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇందులో ఓ కీలక పాత్రలో నటించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, వెంకటేష్ ఈ ప్రాజెక్ట్‌కు ఎందుకు అంగీకరించి ఉండొచ్చనే దానిపై పలు ఆసక్తికరమైన కారణాలు వినిపిస్తున్నాయి. మరి ఆ క్రేజీ వైరల్ టాక్ ఏంటనేది ఓ లుక్కేద్దాం..

అజిత్‌తో ఉన్న స్నేహం ఒక కారణమా?

వెంకటేష్‌కు రీమేక్ & ఇతర భాషల సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. పాత్రకు ప్రాధాన్యత ఉంటే భాషను పట్టించుకోకుండా విభిన్న కథలను ఎంచుకోవడం ఆయన కెరీర్‌లో చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అజిత్‌తో వెంకటేష్‌కు మంచి అనుబంధం ఉందనే టాక్ కూడా చాలాకాలంగా ఉంది. ఈ ఇద్దరు స్టార్ హీరోలు తొలిసారి ఒకే సినిమాలో కనిపిస్తారనే వార్త నిజమైతే.. తెలుగు, తమిళ సినీ అభిమానులకు ఇది ఇంట్రెస్టింగ్ కాంబినేషన్‌గా మారనుంది. అయితే వెంకటేష్ కేవలం వ్యక్తిగత పరిచయంగానే ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరిస్తారని చెప్పడం కంటే, పాత్రకు ఉన్న ప్రాధాన్యత కూడా కీలక అంశంగా భావించాల్సి ఉంటుంది.

పాత్రకు ఉన్న ప్రాధాన్యతే అసలు కారణమా?

వెంకటేష్ తన కెరీర్‌లో ఎన్నో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘గోపాల గోపాల’, ‘మసాలా’, ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సినిమాల్లో ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే బాలీవుడ్‌లోనూ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంలో నటించారు. దీన్ని బట్టి చూస్తే కథలో బలమైన పాత్ర ఉంటే వెంకటేష్ ఇతర హీరోలతో కలిసి నటించేందుకు వెనుకాడరనే విషయం స్పష్టమవుతుంది. ‘డేర్ డెవిల్’లో ఆయన పాత్ర కూడా కథలో కీలక మలుపులకు కారణమయ్యే విధంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

పాన్ ఇండియా మార్కెట్‌పైనా మేకర్స్ ఫోకస్?

‘డేర్ డెవిల్’ను భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా రూపొందించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగు మార్కెట్‌లో సినిమాపై ఆసక్తి పెంచేందుకు టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ హీరోను కీలక పాత్రలో తీసుకోవాలనే ఆలోచన కూడా ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.

►ALSO READ | Nagarjuna 100th Movie: నాగ్ 100వ సినిమాకు అదిరిపోయే టైటిల్.. ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్!

ఈ క్రమంలోనే వెంకటేష్ పేరు తెరపైకి వచ్చిందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు భారీ రెమ్యూనరేషన్ లేదా స్పెషల్ ప్యాకేజీ ఆఫర్ చేశారనే టాక్ ఊపందుకుంది. కానీ, ఈ వార్తలకు ఇప్పటివరకు అధికారిక ధృవీకరణ లేదు.

కాంబినేషన్ నిజమైతే మాత్రం క్రేజీనే!

మొత్తంగా చూస్తే.. అజిత్-వెంకటేష్ కాంబినేషన్ నిజమైతే ‘డేర్ డెవిల్’పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అజిత్‌కు తమిళనాడులో ఉన్న భారీ క్రేజ్‌కు తోడు వెంకటేష్ స్టార్‌డమ్ కూడా జతకావడంతో తెలుగు మార్కెట్‌లోనూ సినిమాకు మంచి బజ్ ఏర్పడే అవకాశం ఉంది. అయితే వెంకటేష్ ఈ సినిమాలో నటిస్తున్నారనే విషయంపై మేకర్స్ నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. 

గుడ్ బ్యాడ్ అగ్లీ’కి పూర్తి భిన్నంగా..

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ప్రధానంగా అజిత్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించామని అధిక్ రవిచంద్రన్ గతంలో చెప్పారు. అయితే ‘డేర్ డెవిల్’ విషయంలో మాత్రం కథ, స్క్రీన్‌ప్లేకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, యాక్షన్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందించనున్నట్లు తెలిపారు.‘డేర్ డెవిల్’ను 2027 సమ్మర్‌లో విడుదల చేసే అవకాశాలున్నట్లు కొన్ని సినీ వర్గాల సమాచారం. అజిత్–అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్, అనిరుధ్ మ్యూజిక్, అజిత్ వైఫ్ షాలిని నిర్మాతగా ఎంట్రీ.. ఇలా ప్రత్యేకతలు కలగలిసిన ‘డేర్ డెవిల్’పై కోలీవుడ్‌లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.