సంగారెడ్డి, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా నూతన స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా శనివారం నుంచి ఈ కార్డుల పంపిణీని ప్రారంభించనుంది. సంగారెడ్డి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. మిగిలిన 118 నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు కార్డులను అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.05 కోట్ల కుటుంబాలకు ఈ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనుంది.
లబ్ధిదారులకు అందించనున్న స్మార్ట్ కార్డులను క్రెడిట్ కార్డు సైజులో, ఆకర్షణీయమైన వాటర్‌ప్రూఫ్ మెటీరియల్‌తో రూపొందించారు. కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్‌తో పాటు భద్రతా ఫీచర్లను పొందుపరిచారు. కాగా, సంగారెడ్డి జిల్లాలో స్మార్ట్ కార్డుల పంపిణీకి సంబంధించి ఇప్పటికే 90 శాతం ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 855 రేషన్ షాపుల పరిధిలో మొత్తం 4,48,446 కార్డులు ఉండగా, ప్రస్తుతం 4.46 లక్షల స్మార్ట్ కార్డులు సిద్ధమయ్యాయి.
భారీ బహిరంగ సభ..
సీఎం సంగారెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నేతలు, అధికారులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సభా ఏర్పాట్లను పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి ఐఐటీ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడ జవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి అంబేద్కర్ స్టేడియానికి చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. 3.50 గంటలకు ఐఐటీ నుంచి సీఎం తిరిగి హైదరాబాద్ తిరిగివెళ్తారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ, జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
