Food : టమాటా మజ్జిగ, కాకరకాయ పులుసు, నిమ్మకాయ రసం.. ఈ వర్షాకాలంలో టేస్టీ బెస్ట్ ఫుడ్

Food : టమాటా మజ్జిగ, కాకరకాయ పులుసు, నిమ్మకాయ రసం.. ఈ వర్షాకాలంలో టేస్టీ బెస్ట్ ఫుడ్

రైనీ సీజన్​ స్టాటయింది.. అడపా దడపా వర్షాలు కూడా పడుతున్నాయి. ఇన్​ ఫెక్షన్లకు ఈ కాలం పెట్టింది పేరు.  వైరస్​ లు దాడి చేసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.  అలా కాకుండాహెల్దీగా ఉండాలంటే ఈ సీజన్​ లో ఇమ్యూనిటి పవర్​ పెంచే ఫుడ్​ తీసుకోవాలి.  ఈ స్టోరీలో అలాంటి వంటకాలైన టమాటా మజ్జిగ.. కాకరకాయ పులుసు.. నిమ్మకాయ రసం  ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. . .! 

టొమాటో మజ్జిగ తయారీకి కావాల్సినవి

  •  టొమాటో తరుగు- పావు కప్పు
  • మజ్జిగ- నాలుగు కప్పులు
  • శెనగపిండి - ఒక టీ స్పూన్
  • పసుపు- చిటికెడు
  • ఉప్పు- తగినంత
  • పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్
  • అల్లం తరుగు-అర టీ స్పూన్
  •  వాము - చిటికెడు
  •  కొత్తిమీర తరుగు-పావు కప్పు
  • ఎండుమిర్చి- రెండు
  •  ఆవాలు- పావు టీ స్పూన్
  •  జీలకర్ర - అర టీ స్పూన్
  • కరివేపాకు- రెండు రెమ్మలు
  •  నూనె - సరిపడా

టొమాటో మజ్జిగ తయారీ విధానం

 ఒక గిన్నెలో కొంచెం నూనె వేసి, టొమాటో తరుగు, ఉప్పు, పసుపు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, వాము, సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. అది మసులుతున్నప్పుడే శెనగపిండి వేసి ఉండలు లేకుండా కలపాలి. తర్వాత అందులో మజ్జిగ కూడా వేయాలి. 

సన్నని మంట మీద మిశ్రమాన్ని ఐదు నిమిషాలు ఉడికించాలి. మరో పాన్లో నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి పోపు పెట్టాలి. దాన్ని పులుసులో వేసి కలపాలి. పుల్లపుల్లగా ఉండే మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది.

పండు కాకరకాయ పులుసు తయారీకి కావాల్సినవి

  •  పండిన కాకరకాయలు -మూడు
  • ఉల్లిగడ్డ తరుగు - అర కప్పు
  • పచ్చిమిర్చి తరుగు - ఒక టేబుల్ స్పూన్
  • కరివేపాకు - నాలుగు రెమ్మలు
  •  చింతపండు రసం – రెండు కప్పులు
  •  జీలకర్ర - పావు టీ స్పూన్
  • ఆవాలు పావు టీ స్పూన్
  • నూనె - సరిపడా
  • ఎండుమిర్చి - నాలుగు
  • బెల్లం తరుగు -అర కప్పు
  •  కొబ్బరి తురుము - అర కప్పు
  • పసుపు - చిటికెడు
  • ఉప్పు- తగినంత 
  • బియ్యప్పిండి - పావు కప్పు

పండు కాకరకాయ పులుసు తయారీ విధానం

నూనె వేడి వేసి ఉల్లిగడ్డ తరుగు, కాకర ముక్కలు (గింజలు లేకుండా), పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి తరుగు వేసి వేగించాలి. అవన్నీ బాగా మగ్గాక చింతపండు రసం, బియ్యప్పిండి (ఉండలు కట్టకుండా కలుపుతూ వేయాలి). బెల్లం తరుగు, కొబ్బరి తురుము వేసి కలపాలి. 

ఐదు నిమిషాలు బాగా మగ్గాక స్టవ్ ఆపేయాలి. మరో పాన్ లో నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి పోపును వేసి కలపాలి. ఈ పులుసు చల్లారాక వేడివేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది.

నిమ్మకాయ రసం తయారీకి కావాల్సినవి

  • నిమ్మరసం టీ స్పూన్లు
  • కందిపప్పు లేదా పెసరపప్పు ముద్ద (ఉడికించినది) – ఒకటి లేదా రెండు టీ స్పూన్లు 
  • ఉప్పు తగినంత
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు
  •  పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి - రెండు
  • నెయ్యి - అర టేబుల్ స్పూన్
  •  ఆవాలు - పావు టీ స్పూన్
  • జీలకర్ర - పావు టీ స్పూన్
  • ఇంగువ -చిటికెడు

నిమ్మకాయ రసం తయారీ విధానం

 పాన్​ లో  నెయ్యి వేడి చేసి జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పచ్చిమర్చి లేదా ఎండుమిర్చి వేయాలి. అవన్నీ వేగాక ఉప్పు, సరిపడా నీళ్లు పోయాలి. రెండు నిమిషాలు బాగా మరిగాక నిమ్మరసం వేసి మూతబెట్టాలి. నిమ్మరసం వేశాక మరిగిస్తే చారు చేదవుతుంది. చింతపండు పడని వాళ్లు ఈ నిమ్మకాయ రసం రెగ్యులర్ గా చేసుకొని తినొచ్చు. వేడి వేడి అన్నంలో తింటే సూపర్​ గా ఉంటుంది..