ఇకపై వాట్సాప్‌లో మీ పర్సనల్ నంబర్ ఇతరులకు కనిపించకుండానే చాటింగ్ చేసే క్రేజీ ఫీచర్ వచ్చేస్తోంది. అవును మీరు విన్నది నిజమే. ఫోన్ నంబర్ ఇవ్వకుండానే కేవలం ఒక యూజర్‌నేమ్ క్రియేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వచ్చు. గ్రూపుల్లో జాయిన్ అయినప్పుడు మీ నంబర్ ఎవరికీ తెలియకుండా దాచేయడానికి ఈ సరికొత్త ప్రైవసీ అప్‌డేట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వారం నుండే యూజర్‌నేమ్‌ను ముందుగానే రిజర్వ్ చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. ఇందుకోసం మీ యాప్ లేటెస్ట్ వెర్షన్‌లోకి అప్‌డేట్ చేసుకుని.. సెట్టింగ్స్ > అకౌంట్ > యూజర్‌నేమ్ ఆప్షన్‌లోకి వెళ్లి మీకు నచ్చిన పేరును లాక్ చేసుకోవచ్చు.
ఈ యూజర్‌నేమ్స్ కోసం ఎలాంటి పబ్లిక్ డైరెక్టరీ లేదా సజెషన్ లిస్ట్‌లు ఉండవు. అంటే మీ కచ్చితమైన యూజర్‌నేమ్ తెలిస్తేనే ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు. రాబోయే కొన్ని నెలల్లో ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రానుంది. ఇది లైవ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. నంబర్ షేర్ చేయడం ఇష్టం లేని చోట, అపరిచితులతో చాట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ఫీచర్ ఒక రక్షణగా నిలుస్తుంది.
దీనితో పాటు వాట్సాప్ మరో మైండ్ బ్లోయింగ్ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. అదే "సైడ్ చాట్". మీరు మీ ఫ్రెండ్స్‌తో పర్సనల్ చాట్‌లోనో లేదా గ్రూప్ చాట్‌లోనో మాట్లాడుతుండగా.. ఆ స్క్రీన్‌ను అస్సలు వదలకుండానే పక్కనే మెటా ఏఐతో గుసగుసలాడొచ్చు. ఉదాహరణకు మీరు మీ గ్యాంగ్‌తో ఏ రెస్టారెంట్‌కు వెళ్లాలో గ్రూప్‌లో డిస్కస్ చేస్తున్నారు అనుకోండి. వెంటనే చాట్ స్క్రీన్ పక్కనే ఓపెన్ అయ్యే సైడ్ ప్యానల్‌లో మెటా ఏఐని అడిగి రెస్టారెంట్ టైమింగ్స్, మెనూ, టేబుల్ బుకింగ్ వంటి వివరాలను క్విక్‌గా వెతికేయొచ్చు.
ఈ "సైడ్ చాట్" కోసం వాట్సాప్ సరికొత్త ప్రైవేట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని వాడుతోంది. ఈ ఏఐ చాటింగ్‌లు ఎంత పటిష్టంగా ఉంటాయంటే.. మీ సంభాషణలను వాట్సాప్ కానీ, మెటా సంస్థ కానీ అస్సలు చూడలేవు. పైగా ఇవి టెంపరరీ చాట్స్ కావడం విశేషం. మీరు చాట్ పూర్తి చేసిన కాసేపటికే ఈ మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా మాయమైపోతాయి. ఇంకెందుకు ఆలస్యం, మీ వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకుని ఈ క్రేజీ ప్రైవసీ ఫీచర్స్ కోసం రెడీ అయిపోండి.
