జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ, చట్టపరమైన వివాదం అలుముకుంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న 27 నియోజకవర్గాల్లోని బీజేపీ అభ్యర్థుల కోసం ఆయన జోహో సంస్థకు చెందిన కార్పొరేట్ నిధులను మళ్లించారంటూ మద్రాస్ హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది. భారత ఎన్నికల సంఘం, ఆదాయపు పన్ను శాఖ, సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ టాక్సెస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంస్థల ద్వారా దీనిపై సమగ్రమైన, స్వతంత్ర, కాలపరిమితితో కూడిన విచారణ జరిపించాలని ఈ పిటిషన్‌లో కోరారు.
చెన్నై పెరుంగుడికి చెందిన న్యాయవాది పి. సుందర వడివేలు ఈ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. జోహో కార్పొరేట్ ఖాతాల నుండి పెద్ద మొత్తంలో నిధులు చేతులు మారాయని, ఇవి కంపెనీకి సంబంధించిన చట్టబద్ధమైన వ్యాపార కార్యకలాపాలకు కాకుండా ఇతర రాజకీయ అవసరాలకు ఉపయోగించబడ్డాయని ఆయన తన పిటిషన్‌లో తీవ్రంగా ఆరోపించారు. కార్పొరేట్ నిధులను ఈ విధంగా మళ్లించడం అనేది కేవలం ఆర్థిక అవకతవకలే కాకుండా.. కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను, పన్ను చట్టాలను, చట్టబద్ధమైన నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నిధుల మళ్లింపు ముఖ్యంగా బీజేపీ పోటీ చేస్తున్న వాసుదేవనల్లూర్ నియోజకవర్గంతో పాటు మిగిలిన 26 నియోజకవర్గాల్లోని రాజకీయ నాయకులకు చేరినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఒకవేళ ఈ ఆర్థిక లావాదేవీల ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసినట్లు తేలితే.. అది ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 123 ప్రకారం 'అవినీతి పద్ధతి' కిందకు వస్తుందని వడివేలు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే దర్యాప్తు జరపాలని కోరుతూ తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి అర్చనా పట్నాయక్‌కు కూడా వినతిపత్రం సమర్పించారు. ప్రముఖ టెక్ దిగ్గజం జోహో నిధులు ఎన్నికల ఫండింగ్‌కు వాడారనే ఈ ఆరోపణలు అటు కార్పొరేట్ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.
