ట్రాన్స్‌ఫర్ల కోసం నా దగ్గరకు రావొద్దు.. పని చేయని అధికారులపై యాక్షన్ తప్పదు: మంత్రి వివేక్

ట్రాన్స్‌ఫర్ల కోసం నా దగ్గరకు రావొద్దు.. పని చేయని అధికారులపై యాక్షన్  తప్పదు: మంత్రి వివేక్

నాయకులు ఎవరూ  అధికారుల ట్రాన్స్‌ఫర్ల కోసం లెటర్లు పట్టుకుని తన దగ్గరకు రావొద్దని సూచించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అధికారులు ఉన్నది  ప్రజల కోసం  చేయడానికేనన్నారు.. అధికారులు పని చేయకపోతే నాకు  చెబితే   చర్యలు తీసుకుంటాను అంతే తప్ప బదిలీల కోసం రావొద్దన్నారు.  గ్రామాల్లో సమస్యలు ఉంటే వాటిని తీర్చాలని  తన దగ్గరకు రావాలని  స్పష్టం చేశారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు.

బూత్ స్థాయి నుంచే పార్టీని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా చెన్నూరు మండల ముఖ్య నేతలతో మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ (BLA-2) సమావేశంలో ఆయన కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న 'సర్' (SIR) ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు మంత్రి అవగాహన కల్పించారు. గ్రామాల్లో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ బీఎల్ఏ, పార్టీ కేడర్, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి 'సర్' ప్రక్రియను ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లాలన్నారు.


అలాగే నియోజకవర్గంలోని పోడు భూముల సమస్యపై నిన్ననే అటవీ శాఖ అధికారులతో మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. రెండు సంవత్సరాల కిందట ఎలా వ్యవసాయం చేసుకున్నారో.. ఇప్పుడు కూడా అలాగే చేసుకోవచ్చని, అయితే కొత్తగా అటవీ భూములను ఎవరైనా ఆక్రమిస్తే మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు.