వెలుగు ఓపెన్ పేజీ : దేశ విశ్వాసాన్ని మింగేసిన అయోధ్య అక్రమాలు!

వెలుగు ఓపెన్ పేజీ :  దేశ విశ్వాసాన్ని మింగేసిన అయోధ్య అక్రమాలు!

అయోధ్య రామజన్మభూమి రథయాత్ర నడిపిన అద్వానీ నుంచి మొదలుకుంటే, రామజన్మభూమి మందిర నిర్మాణం చేసి ప్రారంభించిన నేటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు.. భారతీయ జనతాపార్టీయే కీలకపాత్ర పోషించింది. అయోధ్య మందిరంతో ఆ పార్టీకి ఉన్న అనుబంధాన్ని ఎవరూ కాదనలేరు.  కొన్ని పార్టీలకు చెందిన అగ్రనాయకులు ఇప్పటికీ అయోధ్య రాముని దర్శనం చేసుకోలేదు. నిజానికి దేశంలోని ప్రతి హిందువు అయోధ్య రామాలయాన్ని కోరుకున్నాడు. ఆలయాన్ని  హిందువులు రాజకీయ దృష్టితో  చూడడంలేదు. కోట్లాది హిందువులు ఆ మందిరాన్ని  దర్శించారు, దర్శిస్తున్నారు. అయోధ్య రామునికి కానుకలు, చందాలు సమర్పించుకుంటూనే ఉన్నారు. ఆలయ నిర్మాణానికే భక్తులు వేల కోట్ల రూపాయిల చందాలు ఇచ్చారు. కొందరు వెండి ఇటుకలు, మరికొందరు బంగారు ఆభరణాలు, ఇంకొందరు నగదు ఇలా అనేక రూపాల్లో అయోధ్య రాముడి మందిరం కోసం భారీగా విరాళాలు ఇచ్చారు. 


ఆలయం ప్రారంభమయ్యాక ఇప్పటివరకు సుమారు 15 కోట్లకు పైగా భక్తులు రాముణ్ని దర్శించుకున్నారని రికార్డులు చెపుతున్నాయి. రాముని దర్శనానికి వెళ్లిన ప్రతి భక్తుడు తన 
తాహతుకు తగ్గ ధనాన్ని భక్తితో హుండీలో వేస్తున్నారు.  నగదు, నగలు విలువ సుమారు వేల కోట్లలోనే ఉండి ఉంటాయి. అయితే  సిబ్బంది చేతివాటం కూడా రూ.200 కోట్లు ఉండొచ్చని ఓ వార్త. హుండీ లెక్కింపు దగ్గర, అలాగే బ్యాంకుకు తీసుకెళ్లే సిబ్బంది దొంగతనాలకు పాల్పడినట్లు చెపుతున్నారు. ట్రస్ట్​ ఉండగా కింది సిబ్బంది ఇంత భారీ ఎత్తున దొంగ తనాలు చేయడం సాధ్యమేనా అని అందరూ ఆశ్చర్య పోతున్నారు. భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆలయ ట్రస్ట్​ సభ్యులు, సిబ్బంది దెబ్బతీశారు. రాముని పట్ల భక్తి కలిగిన ప్రతి హిందువును విచలితుణ్ణి చేశారు.  

భూముల కోనుగోళ్లలోనూ ఆరోపణలొచ్చాయి

గతంలోనే ఆలయం కోసం చేసిన భూముల కొనుగోళ్లలో ట్రస్ట్​ జనరల్​ సెక్రటరీ చంపత్​ రాయ్​పై  చాలా ఆరోపణలున్నాయి. 2021లో  అయోధ్య తహసీల్​లోని 1.208 హెక్టార్ల భూమిని ఒక వ్యక్తి రూ.2 కోట్లకే  కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే, అదే భూమిని  ఆలయం కోసం  ట్రస్ట్​  ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ రూ.18.5 కోట్లకు కొనుగోలు చేశారని  తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి.   ఆలయం పేర మరిన్ని భూముల కొనుగోళ్లలోనూ ఆయనపై ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆయన ట్రస్ట్​ జనరల్​ సెక్రటరీగా ఉండగానే  హుండీ దొంగతనాలు బయట పడడం గమనార్హం. చంపత్​ రాయ్​ భూముల కొనుగోళ్ల ఆరోపణలు వచ్చిన నాడే (2021) నైతికంగా రాజీనామా చేయాల్సింది.  కానీ చేయలేదు.

ట్రస్ట్​ సభ్యుల రాజీనామాలు లేవు యూపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. 8 మంది సిబ్బందిని అరెస్టు చేశారు.  ట్రస్ట్​ జనరల్​ సెక్రటరీ చంపత్​ రాయ్​, మరొక సభ్యుడు అనిల్ శర్మ  మాత్రమే  రాజీనామా చేశారని వార్త.  కానీ వారిపై ఎలాంటి ఎఫ్​ఐఆర్​ లేదు. కనీసం వారి రాజీనామాలు ఆమోదం పొందిన వార్త కూడా లేదు. మిగతా ట్రస్ట్​ సభ్యులు కూడా  ఇప్పటివరకైతే  రాజీనామా చేయకపోవడం గమనార్హం.  ట్రస్ట్​ సభ్యులంతా రాజీనామా చేయకుండా దర్యాప్తు జరపడాన్ని  న్యాయనిపుణులు సైతం తప్పుపడుతున్నారు.

వీహెచ్​పీ, సంఘ్​ ఆధ్వర్యంలో  ఇలాగేనా?

ట్రస్ట్​ సభ్యులంతా విశ్వహిందూ పరిషత్​ నేతలే ఉన్నారు. అందులో పనిచేసే సిబ్బంది సైతం సంఘ్​ సంబంధీకులే తప్ప మరెవరూ లేరని వింటున్నాం. నిజానికి  ఆర్ఎస్ఎస్,  వీహెచ్​పీ, రాజకీయంగా బీజేపీ అయోధ్య ఉద్యమాన్ని క్రీయాశీలకంగా నడిపాయి. విజయం సాధించాయి.  నిజానికి వాటి ప్రతిష్ట  అయోధ్య మందిరంతో ముడిపడి ఉందని మర్చిపోవద్దు.  కంచే చేను మేసినట్లు ట్రస్ట్​ సభ్యుల పనితీరు అలా ఉన్నపుడు, బాధ్యతగల సంఘ్​ పెద్దలు  అప్పుడే (2021) చక్కదిద్ది ఉండాల్సింది కదా! ఆ పని ఎందుకు చేయలేకపోయారని ఎంతోమంది స్వయానా ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్తలే బాధపడుతున్నారని వింటున్నాం. ఇప్పటికైనా వెంటనే చర్యలకు దిగి ఉంటే బాగుండేది.  ఈ వ్యాసం రాసే సమయానికి కూడా   ట్రస్ట్​ సభ్యులంతా  రాజీనామా చేయకపోవడం  ఒక  విచిత్రం. 

మందిర నిర్మాణంలో మోదీ చొరవ

దేశానికి ఒక  సుస్థిర ప్రభుత్వం కోసం  ఒక బలమైన నాయకుడు అవసరం అనే కోణంలో ప్రధాని మోదీ గత 12 ఏండ్లుగా ప్రజాదరణలో ముందుంటూ వస్తున్నారు. ఫలితంగానే దేశానికి ఆయన 3సార్లు ప్రధాన మంత్రి కాగలిగారు. అయోధ్య రామ జన్మభూమి మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుకూల తీర్పు రాగానే, మందిర నిర్మాణానికి  ప్రధాన మంత్రిగా మోదీ చూపిన చొరవ ముఖ్యంగా హిందువుల్లో  ఆయన పట్ల  మరింత విశ్వాసాన్ని పెంచింది.  అయోధ్య మందిర నిర్మాణం, ట్రస్ట్​ ఏర్పాటు పీఎంవో ఆఫీసు పర్యవేక్షణలోనే జరిగాయి.  ఒక్క అయోధ్య ఉద్యమం దేశంలో బీజేపీని రాజకీయంగా సుస్థిరపరిచిన విషయాన్ని ఎవరూ కాదనలేరు. అలాంటి అయోధ్య ఆలయం అక్రమాలకు గురికావడం చూస్తే.. అందరి వేళ్లూ  బీజేపీ వైపే  చూపడంలో ఆశ్చర్యంలేదు.  మోదీ  
ప్రభుత్వాన్ని  బద్​నాం  చేయడానికి,  ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయంటూ సరిపుచ్చుతామంటే.. అయోధ్య మందిరంలో జరిగిన అక్రమాలు అందుకు ఒప్పుకోవు మరి!

పెరిగిన హిందూ కన్సాలిడేషన్​ దెబ్బతింటే..

2004 లోక్​సభ ఎన్నికల్లో  బీజేపీకి హిందువులు 31శాతం, 2009లో 31శాతం, 2014లో 36 శాతం,  2019లో 44శాతం,  2024లో 43శాతం మంది  ఓటేశారని  ఓ సర్వే సంస్థ చెపుతోంది.  ఇకపోతే, బీజేపీతో కలిపి ఎన్​డీఏకు హిందువులు 52శాతం ఓటు వేశారని చెపుతోంది. బీజేపీకి వస్తున్న ఓట్లలో మోదీ పేర 32%, అయోధ్య మందిరం పేర22% ఓటు వేశారని  తెలుస్తోంది.  ఈ లెక్కలను చూసినపుడు బీజేపీ రాజకీయాన్ని  అయోధ్య మందిరం ఎంత ప్రభావితం చేసిందో ఎవరికైనా అర్థం కావల్సిందే.  హిందూ కన్సాలిడేషన్​ ఏమాత్రం దెబ్బతిన్నా, బీజేపీ భారీ మూల్యం  చెల్లించుకోకతప్పదు. అది పరోక్షంగా  కాంగ్రెస్​ పార్టీకి మేలుచేసే అవకాశాలే ఎక్కువ అని చెప్పడానికి  సెఫాలజిస్టులే  అక్కరలేదేమో! 

తటస్థ ఓటర్లు దూరమైతే..

పెట్రోల్​ ధర రూ.500 అయినా ఫరవాలేదు, నేను మోదీనే  ప్రధానిగా కోరుకుంటాను అనేవాళ్లను కూడా  మనం చూస్తుంటాం. ఇలాంటి కట్టర్​ ఓటు బ్యాంక్​ ను పక్కనపెడితే,  బీజేపీకి కమిటెడ్​ ఓటు బ్యాంకు కూడా 22శాతం ఉంది.  వీరిని కూడా పక్కన పెడితే, 15శాతం  తటస్థ  ఓటర్లే బీజేపీని  గెలిపిస్తూ  వస్తున్నారనే విషయం  మర్చిపోవద్దు.  ఇపుడు అయోధ్యలో జరిగిన అక్రమాలు చూశాక ఈ తటస్థ ఓటర్లలోనే కొంత అభిప్రాయం మారే అవకాశం ఉండొచ్చని సెఫాలజిస్టుల అభిప్రాయం. తటస్థ ఓటర్లను దూరం చేసుకోకుండా ఉండాలంటే , ఏం చేయాలో ఆలోచించుకోవాల్సింది  బీజేపీ, మోదీనే!   వెంటనే  అయోధ్య శ్రీరామ్​  జన్మభూమి తీర్థ్ ట్రస్ట్​ను  రద్దు చేయాలి. జరిగిన అక్రమాలపై  వేగంగా దర్యాప్తు జరిపించాలి. దోషులకు శిక్షలు పడాలి.  ట్రస్ట్​లో  వీహెచ్​పీ నేతలే ఉన్నారు కాబట్టి, దర్యాప్తు ఎంత నిజాయితీ జరుగుతుందనే అనుమానాలు  ప్రతిపక్షాలు వ్యక్తం చేయడంలో  తప్పులేదు. అంతకన్నా ముఖ్యంగా కోట్లాది హిందువులలో ఏర్పడిన అనుమానాలను  దూరం  చేయడమే   ఇపుడు మోదీ,  యోగీ  ప్రభుత్వాలకు  పరీక్ష కాబోతుంది.

కరసేవకు​ల బలిదానాలు మరిచారా? 

భక్తునికి, భగవంతునికి అనుసంధానం లాంటి మందిరాలలో దొపిడీ, దొంగతనాల గురించి చాలానే వింటుంటాం. అది షరామామూలే కావచ్చు. కానీ అయోధ్య రామ మందిరం అందుకు భిన్నం అనే ప్రజల విశ్వాసం ఇవాళ దెబ్బతినడమే చర్చనీయాంశం.  అద్వానీ రథయాత్ర ఆరంభించిననాడు, కర సేవకులు బాబ్రీ కట్టడాన్ని కూల్చిననాడు, పోలీసు తూటాలకు  వందల మంది కర సేవకులు అమరులైననాడు, సరయూ నదిలో కర సేవకుల శవాలు పడేసిననాడు, 2022లో ప్రధాని మోదీ అయోధ్య మందిరాన్ని ఆరంభించిననాడు.. ఈ దేశంలోని ఏ హిందువూ భవ్య రామమందిరంలో ఇలా భక్తులు సమర్పించిన ధనం లూటీ అవుతుందని ఊహించలేదు! ఆ విశ్వాసం.. అపజయం పాలయిందెందుకు అనేదే ప్రతి హిందువును ఆందోళనకు గురిచేస్తోంది! 

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి
సీనియర్​ జర్నలిస్ట్​

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.