మీ ఆటలు సాగనీయ్య: ఇండిపెండెన్స్ డే వేడుకల్లో CM విజయ్ పవర్ ఫుల్ స్పీచ్

మీ ఆటలు సాగనీయ్య: ఇండిపెండెన్స్ డే వేడుకల్లో CM విజయ్ పవర్ ఫుల్ స్పీచ్

చెన్నై: తమిళనాడు సీఎం హోదాలో తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం విజయ్ పవర్ ఫుల్ స్పీచ్‎తో అదరగొట్టారు. తన ప్రభుత్వా్న్ని కూల్చేయడానికి కుట్రలు చేస్తోన్న ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన పాలనకు వ్యతిరేకంగా జరిగే కుట్రలను కూడా భగ్నం చేస్తామని.. వారి ఆటలు సాగనీయ్యనని హెచ్చరించారు. 

తమిళనాడు రాజధాని చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం హోదాలో టీవీకే చీఫ్ విజయ్ తొలిసారి మువ్వెన్నల జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసులు గౌరవవందనం స్వీకరించి ఆ తర్వాత రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా తమిళ బంధువులందరికీ, జెన్ జెడ్ స్నేహితులందరికీ నా వణక్కం అంటూ విజయ్ స్పీచ్ ప్రారంభించారు. 

పరిపాలనా విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పిన విజయ్.. తమిళనాడు హక్కులకు వ్యతిరేకంగా ఉండే విధానాలను మాత్రం తమ ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలనే స్వేచ్ఛ అని.. తమ ప్రభుత్వం ఆ లక్ష్యం దిశగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయం ప్రైవేటు వ్యక్తులకు వెళ్లకుండా నిరోధించామని.. అన్ని శాఖలలో అవినీతిని నిర్మూలించడానికి నిరంతర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రజలకు ఉపయోగపడే గత ప్రభుత్వాల పాత పథకాలను కూడా మా ప్రభుత్వం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే అమ్మ ఉనవగం (అమ్మ క్యాంటీన్లు), పాఠశాల విద్యార్థుల కోసం డీఎంకే ప్రారంభించిన అల్పాహార పథకాలను కంటిన్యూ చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి విషయాల్లో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని పేర్కొన్నారు. 

ద్రావిడ దిగ్గజం సి.ఎన్. అన్నదురై జయంతిని పురస్కరించుకుని 2026, సెప్టెంబర్ 15న ప్రభుత్వ ఆసుపత్రులలోని నవజాత శిశువుల కోసం రూ.755.83 కోట్ల వ్యయంతో బంగారు ఉంగరాల బహుమతి పథకాన్ని (తైమామన్ తంగ మోతిరం తిట్టం) ప్రారంభించనున్నట్లు విజయ్ ప్రకటించారు.

అలాగే, మాజీ సైనికుల కుమార్తెల వివాహానికి (గరిష్టంగా ఇద్దరు కుమార్తెలు అర్హులు) అందించే ఆర్థిక సహాయాన్ని రూ. 25 వేల నుంచి రూ. 50 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దివ్యాంగులైన మాజీ సైనికులకు, వారి కుటుంబాలకు అందించే నెలవారీ సహాయాన్ని రూ. 5 వేల నుంచి రూ. 7 వేలకు పెంచనున్నట్లు తెలిపారు. 

కుల, మత భేదాలను పక్కనపెట్టి.. డబ్బు, కండబలాన్ని తిరస్కరించి.. ప్రజా కేంద్రీకృత, సామాజిక న్యాయ ప్రభుత్వాన్ని స్థాపించడానికి టీవీకే పార్టీకి అఖండ మద్దతునిచ్చిన తమిళనాడు ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. అవినీతి రహిత ప్రభుత్వాన్ని సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.