రోజువారీ కూలీలను వరించిన అదృష్టం.. రూ.50 లక్షలు విలువైన వజ్రం దొరికింది

రోజువారీ కూలీలను వరించిన అదృష్టం.. రూ.50 లక్షలు విలువైన వజ్రం దొరికింది

పూట గడిచేందుకు జీవితంలో కష్టమే పెట్టుబడిగా బతికే రోజువారీ కూలీలను అదృష్టం అకస్మాత్తుగా వరించింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో 7 కూలీలు లీజుకు తీసుకున్న గనుల్లో అరుదైన రత్నం లభించడంతో వారి తలరాత ఒక్కసారిగా మారిపోయింది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడంతో ఆ ఫ్యామిలీస్ సంతోషంలో మునిగిపోయాయి. 

పన్నా జిల్లాలోని సరోఖా గ్రామానికి చెందిన అఖిలేశ్ పాల్‌తో పాటు మరో 6 మంది కూలీలు రెండేళ్ల క్రితం ఒక పాత మైన్‌ను లీజుకు తీసుకున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా ఎలాంటి రత్నాలు దొరకకపోవడంతో ఏడాదిపాటు ఆ గనిని మూసివేసి పక్కనే మరో గనిలో పని చేయడం ప్రారంభించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పాత గనిని పరిశీలించేందుకు వెళ్లగా.. వారికి ఊహించని అదృష్టం ఎదురైంది. పాత గని పైన భాగంలో మెరుస్తున్న సుమారు 17.96 క్యారెట్ల బరువున్న అత్యుత్తమ నాణ్యత కలిగిన వజ్రం వారికి కనిపించింది. ఈ రత్నం విలువ మార్కెట్లో దాదాపు రూ.50 లక్షల వరకు ఉంటుందని వజ్రాధికారి రవి పటేల్ తెలిపారు.

ఈ అరుదైన వజ్రాన్ని వచ్చే అక్టోబర్‌లో జరిగే ప్రభుత్వ వేలంలో ఉంచనున్నారు. రూల్స్ ప్రకారం వేలం పాట ద్వారా వచ్చే మొత్తం నుంచి ప్రభుత్వం 12 శాతం రాయల్టీని మినహాయించగా.. మిగిలిన మొత్తాన్ని ఆ ఏడుగురు కూలీలకు సమానంగా పంపిణీ చేయనున్నారు. ఈ ఊహించని అదృష్టంతో తమ లైఫ్ టైమ్ డ్రీమ్స్ నెరవేరుతాయని, ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే వజ్రాల గనులకు ప్రసిద్ధి చెందిన పన్నాలో ఇలాంటి అద్భుతాలు తరచూ జరుగుతూనే ఉంటాయి.