భూమిని చీల్చుకుంటూ ఎగసిపడుతున్న మంటలు.. కుండపోత వర్షంలోనూ ఆరని జ్వాలలు

భూమిని చీల్చుకుంటూ ఎగసిపడుతున్న మంటలు.. కుండపోత వర్షంలోనూ ఆరని జ్వాలలు

భూమి నుంచి నీళ్లు రావటం చూశాం.. భూకంపంతో భూమి చీలటం చూశాం.. అగ్ని పర్వతాలు పేలినప్పుడు మంటలు రావటం చూశాం.. ఇప్పుడు అక్కడ అలాంటివి ఏమీ లేకుండానే.. భూమిని చీల్చుకుంటూ మంటలు ఎగసిపడటం అనేది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతే కాదు.. ఆ ప్రాంతం అంతా కుండపోత వర్షం పడుతుంది.. ఇంత భారీ వర్షంలోనూ ఆ మంటలు ఆరటం లేదు.. భగ భగమంటూ మంటలు.. భూమిని చీల్చుకుని ఎగసి పడటం భయాందోళనలకు గురి చేస్తోంది. జార్ఖండ్ రాష్ట్రం స్టీల్ సిటీ అయిన బొకారో ఏరియాలోని ఓ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లా బంధ్ గ్రామం అది. గ్రామ శివార్లలో తోటలు ఉన్నాయి. రెండు రోజుల నుంచి ఆ ప్రాంతంలో భూమిలో చీలకలు వచ్చాయి. ఆ తర్వాత బుడగలు.. నీళ్లు మరుగుతున్నట్లు నీళ్లు బయటకు వస్తున్నాయి. అదే సమయంలో భూమిని చీల్చుకుంటూ మంటలు ఎగసిపడుతున్నాయి. రెండు రోజులుగా ఆ ప్రాంతం అంతా కుండపోత వర్షం పడుతుంది. ఇంత భారీ వర్షంలోనూ భూమిని చీల్చుకుంటూ మంటలు రావటం అనేది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.,

ఈ ఘటన చూసిన గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ఆ  ప్రాంతానికి వెళ్లటానికే భయపడుతున్నారు. ఈ విషయం అధికారులకు తెలియటంతో ప్రత్యేక బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది. ఆ ప్రాంతం మొత్తాన్ని పరిశీలించిన అధికారులు.. అక్కడ మిథేన్ వాయువులు అధికంగా ఉన్నట్లు నిర్థారించారు. సీనియర్ శాస్త్రవేత్త టీబీ సింగ్ ఈ విషయంపై స్పందించారు. బొకారో జిల్లా పరిధిలో చాలా ప్రాంతాల్లో భూగర్భ మిథేన్ గ్యాస్ నిల్వలు అధికంగా ఉన్నాయని స్పష్టం చేశారు. మిథేన్ వాయువులు భూమి నుంచి బయటకు వచ్చినప్పుడు.. ఆక్సిజన్ తో కలిసిన తర్వాత మండుతుందని.. ఇప్పుడు అక్కడే అదే జరుగుతుందని వెల్లడించారాయన. 

కొన్ని రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయని.. ఈ క్రమంలోనే భూమి వదులుగా మారిందని.. భూమి పైపొర బలహీనంగా మారటంతో.. లోపల ఉన్న మిథేన్ వాయువు బయటకు వచ్చిందని.. ఆక్సిజన్ తో కలిసి మండుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దని.. ఆ ప్రాంతానికి దూరంగా ఉంటే చాలని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే బొకారో జిల్లా తల్గాడియాలో మిథేన్ గ్యాస్ వెలికి తీస్తున్నారని.. ఈ  ప్రాంతంలో అధికంగా ఈ గ్యాస్ నిల్వలు ఉన్నాయని వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు.