న్యూఢిల్లీ, వెలుగు: అయోధ్య రామమందిరంలో జరిగింది సాధారణ దొంగతనం కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద కోట్ల మంది హిందువుల అచంచల విశ్వాసంపై జరిగిన క్రూరమైన దాడి అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనతే అన్నారు. కేవలం 40 రోజుల సీసీటీవీ ఫుటేజీలోనే 70కి పైగా చోరీ ఘటనలు జరిగాయంటే.. గత ఐదున్నరేళ్లుగా అక్కడ ఏ స్థాయిలో దోపిడీ సాగిందో ఊహించలేకపోతున్నామని అన్నారు.
పాత సీసీటీవీ ఫుటేజీలను ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారని అనుమానం వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వ ఆధీనంలోని దర్యాప్తు ఏజెన్సీలు పెద్ద తలకాయలను కాపాడేందుకు ఈ చిన్న చిన్న ‘పావుల’ను బలిచేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీస్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య రామమందిరంలో పవిత్ర విరాళాల చోరీకి నరేంద్ర మోదీ బాధ్యత వహించాలన్నారు.
మందిర నిర్మాణ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ప్రధాని, ఈ ‘మహాపాపం’పై ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఎంపిక చేసిన వ్యక్తులు, ఆర్‌ఎస్‌ఎస్‌కు అత్యంత ఆప్తులు, ఆయనకు ఇష్టమైన బ్యూరోక్రాట్లతో నిండిన ట్రస్ట్ నిఘా నీడలోనే ఈ నిధుల లూటీ జరిగిందన్నారు. సమాచార హక్కు చట్టం పరిధి నుంచి ఈ ట్రస్ట్‌కు మినహాయింపు ఇవ్వడం వెనుక ఉద్దేశం ఇదేనా..? అని ప్రశ్నించారు.
ఈ చోరీ ఘటనలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రూపొందించిన నివేదికను దాచకుండా వెంటనే వెబ్‌సైట్‌లో పెట్టాలన్నారు. ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌తోపాటు అవినీతికి పాల్పడిన ఉన్నతాధికారులపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నారు.
పాపం సామాన్య ఉద్యోగులదేనా..?
అయోధ్యలో జరిగిన మంచి తన ఖాతాలో వేసుకొన్న ప్రధాని.. ఈ పాపంపై ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. శిలాన్యాసం నుంచి ప్రాణప్రతిష్ఠ వరకు ప్రతి వేడుకలోనూ ఆయనే ముందు నిలిచారని గుర్తుచేశారు. మరి ఇప్పుడు అదే పవిత్ర మందిరంలో భక్తుల సొమ్ము దోపిడీకి గురైతే ఆ బాధ్యత ఎవరిదన్నారు.
కేవలం రూ.12 వేల జీతం తీసుకునే కిందిస్థాయి ఉద్యోగులదేనా? అని నిలదీశారు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ను తక్షణమే రద్దు చేయాలన్నారు. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసినందుకు, విరాళాల లూటీకి నైతిక బాధ్యత వహించడంతో పాటు ప్రధాని మోదీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
