మెగా కుడా!..'వరంగల్‍ మాస్టర్‍ప్లాన్‍– 2041'కు అనుగుణంగా ప్రపోజల్స్ పంపిన కుడా

మెగా కుడా!..'వరంగల్‍ మాస్టర్‍ప్లాన్‍– 2041'కు అనుగుణంగా ప్రపోజల్స్  పంపిన కుడా
  •     1,805 చదరపు కిలోమీటర్ల నుంచి 2,800 చదరపు కిలోమీటర్లకు పెంపు 
  •     181 రెవెన్యూ గ్రామాల నుంచి 271 గ్రామాలకు విస్తరణ 
  •     సంస్థ పరిధిలోకి నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల, జనగామ మున్సిపాలిటీలు.!
  •     రాష్ట్ర సర్కార్‍ సానుకూలం.. పరిధి ఇంకాస్త పెంచాలనే సూచనలు

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కాకతీయ అర్బన్ డెవలప్‌‌‌‌మెంట్ అథారిటీ (కుడా) మరింత శక్తివంతంగా మారనున్నది. రాష్ట్ర ప్రభుత్వం, జీడబ్ల్యూఎంసీ నిధులతో సంబంధం లేకుండా సొంతంగా దాదాపు రూ.500 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్న కుడా, ‘గ్రేటర్ వరంగల్ మాస్టర్ ప్లాన్-2041’కు అనుగుణంగా తన పరిధిని విస్తరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రపోజల్స్​ కంటే మరింత పరిధి పెంచాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో గ్రేటర్ వరంగల్ చుట్టూ హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, హుస్నాబాద్, భూపాలపల్లి మార్గాల్లో కుడా పరిధి విస్తరించనుంది.

90 గ్రామాలు.. 1000 చదరపు కిలోమీటర్ల విస్తరణ..

ప్రస్తుతం కుడా పరిధిలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల్లోని 19 మండలాలు, 181 రెవెన్యూ గ్రామాలు కలిపి 1,805 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. కుడా చైర్మన్‌‌గా ఇనగాల వెంకట్రామిరెడ్డి ఉండగా, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వైస్ చైర్మన్‌‌గా వ్యవహరిస్తున్నారు. 'గ్రేటర్ వరంగల్ మాస్టర్ ప్లాన్-2041' అమలు నేపథ్యంలో కుడా పరిధిని మరో వెయ్యి చదరపు కిలోమీటర్ల మేర పెంచాలని నిర్ణయించారు. ఇందుకోసం 271 రెవెన్యూ గ్రామాలతో కలిపి మొత్తం 2,738.19 చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

రూ.వెయ్యి కోట్ల ఆర్థిక శక్తిగా కుడా..

ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌‌పీఎస్) అమలులో కుడా విజయవంతంగా ముందుకెళ్తోంది. గతానికి భిన్నంగా రైతులతో 50:50 వాటా విధానంలో ఒప్పందాలు కుదుర్చుకుని భూములు సేకరించి, వాటిని అభివృద్ధి చేసి విక్రయిస్తోంది. గత 20 నెలల్లో వడ్డెపల్లి, భీమారం, ఆత్మకూర్, కాకతీయ మెగా టెక్స్‌‌టైల్ పార్క్ ప్రాంతాల్లో సుమారు 230 నుంచి 250 ఎకరాల భూమిని సేకరించింది. ఎల్‌‌పీఎస్ ద్వారా రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు సొంత ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా ఓసిటీ, మాసిటీ, ఉనిసిటీ, బాలసముద్రంలోని కుడా ప్లాట్లను దశలవారీగా వేలం వేయడం ద్వారా మరో రూ.400 కోట్ల ఆదాయం సమకూర్చుకుంటోంది.

కుడా చేతిలో మేజర్​ అభివృద్ధి ప్రాజెక్టులు..

గ్రేటర్ వరంగల్‌‌తో పాటు కుడా పరిధిలోని మూడు జిల్లాల్లో పలు మేజర్​ ప్రాజెక్టులను సంస్థ చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కుడా సొంత నిధులను వినియోగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ప్రస్తుతం భద్రకాళి బండ్, కాళోజీ కళాక్షేత్రం, భద్రకాళి మాడవీధులు, ఎల్కతుర్తి జంక్షన్, ఇన్నర్ రింగ్ రోడ్, వరంగల్ బస్ టెర్మినల్, మ్యూజికల్ గార్డెన్ పునరుద్ధరణ, కలెక్టర్ బంగ్లా హెరిటేజ్ భవనం, ఖిలా వరంగల్ మోటులో బోటింగ్, గుండు చెరువు అభివృద్ధి వంటి రూ.400 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. ల్యాండ్ పూలింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా ప్రాంతాల అభివృద్ధికే వినియోగించేలా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి కుడా ముందుకెళ్తోంది. అలాగే ఇంటర్నేషనల్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్, హనుమకొండ బస్ టెర్మినల్, శిల్పకళా వేదిక, భద్రకాళి చెరువుపై గ్లాస్ బ్రిడ్జి, రోప్‌‌వే, సైన్స్ సెంటర్ వంటి ప్రాజెక్టులను కూడా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

మున్సిపాలిటీల వరకు పరిధి విస్తరణ..

ప్రస్తుతం కుడా పరిధి 3 జిల్లాలు, 6 నియోజకవర్గాలు, 181 గ్రామపంచాయతీల వరకు ఉంది. హైదరాబాద్ వైపు స్టేషన్ ఘన్‌‌పూర్, కరీంనగర్ వైపు ఎల్కతుర్తి, సిద్దిపేట వైపు భీమదేవరపల్లి, ఖమ్మం వైపు వర్ధన్నపేట, నర్సంపేట మార్గంలో గీసుగొండ, ములుగు వైపు ఆత్మకూర్ వరకు కుడా పరిధి కొనసాగుతోంది. ప్రతిపాదిత విస్తరణలో మరో 90 రెవెన్యూ గ్రామాలు, వెయ్యి చదరపు కిలోమీటర్లు చేరనున్నాయి. దీంతో స్టేషన్ ఘన్‌‌పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి మున్సిపాలిటీలతో పాటు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ వరకు కుడా పరిధి విస్తరించే అవకాశముంది.

హైదరాబాద్ రూట్లో జనగామ వరకు..

కుడా ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ, మరికొన్ని సూచనలు కూడా చేసింది. హైదరాబాద్ మార్గంలో స్టేషన్ ఘన్‌‌పూర్ వరకు మాత్రమే కాకుండా జనగామ వరకు కుడా పరిధిని విస్తరించాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌‌మెంట్ అథారిటీ (హెచ్‌‌ఎండీఏ) పరిధి ఆలేర్ వరకు ఉన్న నేపథ్యంలో, హెచ్‌‌ఎండీఏ-కుడా పరిధుల మధ్య కేవలం 50 నుంచి 55 కిలోమీటర్ల వ్యత్యాసం మాత్రమే ఉండేలా ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో జనగామ మున్సిపాలిటీతో పాటు రఘునాథపల్లి మండలంలోని ప్రాంతాలను కూడా కుడా పరిధిలో చేర్చి, ఆ ప్రాంతాన్ని ‘మోడల్ మెగా అర్బన్ హబ్’గా అభివృద్ధి చేసే దిశగా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు.