కవ్వాల్ జంగిల్ సఫారీకి మూడు నెలల బ్రేక్.. వన్య ప్రాణులను రక్షించడానికి ప్రత్యేక చర్యలు

కవ్వాల్ జంగిల్ సఫారీకి మూడు నెలల బ్రేక్.. వన్య ప్రాణులను రక్షించడానికి ప్రత్యేక చర్యలు

జన్నారం, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న జన్నారం ఫారెస్ట్ డివిజన్‌‌లో జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పాటు జంగిల్ సఫారీ నిలిపివేశారు. తిరిగి అక్టోబర్ 1 నుంచి సఫారీ సేవలను పునఃప్రారంభించనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ప్రతి ఏడాది కవ్వాల్ టైగర్ జోన్‌‌లో తొమ్మిది నెలల పాటు పర్యాటకులకు సఫారీ వాహనాల్లో అటవీ విహారానికి అనుమతి ఇస్తారు. 

అయితే వర్షాకాలంలో మూడు నెలల పాటు సఫారీని నిలిపివేస్తారు. ఈ కాలంలో పెద్దపులులు, చిరుతలు సహా ఇతర వన్యప్రాణులు అడవిలో సంచరిస్తూ సంతానోత్పత్తి పెంచుకుంటాయి. సఫారీ వాహనాల రాకపోకల వల్ల ఏర్పడే అలికిడి వన్యప్రాణులకు అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, భారత అటవీ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు మూడు నెలల పాటు సఫారీ సేవలను నిలిపివేస్తూ అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వన్యప్రాణుల సంరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జన్నారం ఎఫ్‌‌డీవో రామ్మోహన్ తెలిపారు.