- జైపూర్ మహిళా సంఘానికి మరో బస్సు, పెట్రోల్ బంక్ మంజూరు చేస్తా
- మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్ మండలాల్లో మంత్రి పర్యటన
కోల్‌బెల్ట్/చెన్నూరు, వెలుగు: చెన్నూరు నియోజకవర్గానికి మొదటి విడతలో 3,500 ఇండ్లు మంజూరయ్యాయని, ఈ ఏడాది మరో 2 వేల ఇండ్లు కేటాయిస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జైపూర్ మండలానికి 700 ఇండ్లు మంజూరు చేసినట్టు చెప్పారు. మంగళవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్ మండలాల్లో మంత్రి వివేక్‌వెంకటస్వామి పర్యటించారు. జైపూర్ మండలం గంగిపల్లిలో రూ.15 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించిన మహిళా భవన్‌ను ప్రారంభించారు. అనంతరం గంగిపల్లి, టేకుమట్ల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు.
అంతకుముందు చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, జైపూర్ లో సర్‌పై కాంగ్రెస్ శ్రేణులకు అవగాహన కల్పించారు. చెన్నూరు మున్సిపల్ కౌన్సిలర్లతో వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. మహిళా శక్తి కింద మహిళా సంఘాలకు బస్సులు, పెట్రోల్ బంకులు అందిస్తున్నట్టు చెప్పారు. జైపూర్ మహిళా సంఘానికి మంజూరైన బస్సు ద్వారా నెలకు రూ.70 వేల ఆదాయం వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. త్వరలో మరో బస్సు, పెట్రోల్ బంక్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
జైపూర్ మండలం గంగిపెల్లిలో రూ.50 లక్షలతో స్కూల్ ఏర్పాటు చేశామని, మరో రూ.50 లక్షలతో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు. త్వరలో మరో రూ.20 లక్షలు మంజూరు చేస్తానన్నారు. పోడు భూముల సమస్యలపైన నిన్న అటవీ శాఖ అధికారులతో మాట్లాడానని, రెండేండ్ల కింద చేసుకున్నట్టే సాగు చేసుకోవచ్చని సూచించారు. అటవీ భూములను ఎవరూ ఆక్రమించకూడదన్నారు.
ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ల కోసం లీడర్లేవరూ రావొద్దు
అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్షంగా ఉంటే సహించబోనని మంత్రి హెచ్చరించారు. లీడర్లు ఎవరూ అధికారుల ట్రాన్స్ఫర్ల కోసం లెటర్లు పట్టుకుని తన దగ్గరకు రావొద్దని సూచించారు. ఆఫీసర్లు సరిగా పనిచేయకపోతే చర్యలు తీసుకుంటాను తప్ప బదిలీల కోసం రావొద్దని అన్నారు. గ్రామాల్లో సమస్యలను తన దృష్టికి తీసుకురావాలన్నారు.
కొత్త ఓట్లు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి
గ్రామాలు, పట్టణాల్లో కొత్త ఓట్లు నమోదు ప్రక్రియను బీఎల్ఏలు మరింత వేగవంతం చేయాలని మంత్రి వివేక్ సూచించారు. ప్రతీ బీఎల్ఏ, పార్టీ కేడర్, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ‘సర్’ ప్రక్రియలో ఓట్లు గల్లంతు కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మంచిర్యాల కలెక్టర్‌కుమార్ దీపక్, మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ 'సర్' నియోజకవర్గ కో ఆర్డినేటర్ వొడ్నాల శ్రీనివాస్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ ప్రసాద్ తివారీ, వైస్ చైర్మన్ పాపిరెడ్డి, గంగిపల్లి సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి, లీడర్లు పాల్గొన్నారు.
విశాక ట్రస్టు ద్వారా విద్యార్థులకు బ్యాగుల పంపిణీ..
విశాక ట్రస్ట్ ఆధ్వర్యంలో జైపూర్ మండలం గంగిపెల్లి, టేకుమట్ల స్కూళ్లలో మంత్రి వివేక్ వెంకటస్వామి స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు చెన్నూరు మండలం సోమనపల్లి మాజీ సర్పంచి, కాంగ్రెస్ లీడర్భీమని శ్రీనివాస్‌గౌడ్-శారద దంపతుల కుమారుడు శివకృష్ణ-నవ్య, చెన్నూరుకు చెందిన నేతచింతకింది ప్రశాంత్ చెల్లెలు శివానీ-దుర్గాశంకర్ వధూవరులను మంత్రి ఆశీర్వదించారు. ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన రాపర్తి మోహన్, ఖనిజ్ కుటుంబాలను పరామర్శించారు.
