హస్మత్‌‌పేట్‌‌ భూముల ఆక్రమణ వెనుక పెద్దలు

హస్మత్‌‌పేట్‌‌ భూముల ఆక్రమణ వెనుక పెద్దలు
  • భూకబ్జాలలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ లీడర్లు  
  •  ఒక ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్, ప్రముఖ పారిశ్రామికవేత్త
  •  పోలీసులకు సైతం ప్లాట్ల అమ్మకం.. ఆక్రమణదారులకు సీఐ మద్దతు 
  • హైడ్రా విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి
  • పోలీసుల ప్రమేయంపై విచారణకు డీజీపీకి హైడ్రా లెటర్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు : హస్మత్‌‌పేట్‌‌లోని 98 ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ విక్రయాల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజాం కాలం నాటి ‘ఖుర్షీద్ జా పైగా’ ఆస్తుల పరిధిలోకి వచ్చే ఈ భూములను కబ్జాదారులు పూర్తిగా ఆక్రమించి ప్లాట్లుగా మార్చి అమ్మేశారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకుని జరిగిన ఈ భారీ భూకుంభకోణంపై హైడ్రా ఇప్పుడు ఉక్కుపాదం మోపింది. శనివారం దాదాపు 10 ఎకరాల ఖాళీ భూమికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. అయితే చుట్టుపక్కల అప్పటికే ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్న సామాన్యుల జోలికి మాత్రం అధికారులు వెళ్లలేదు. ఆక్రమణల వెనుక ఉన్న నిందితులపై లోతుగా విచారణ ప్రారంభించగా.. రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నట్లు తేలింది. 

భూ కబ్జాలో ఉన్నది ఎవరంటే..

ఈ భూ కబ్జాలో ఒక ఎమ్మెల్యే, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, ఒక మాజీ కార్పొరేటర్‌‌తో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందిన 10 మందికి పైగా ముఖ్య నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పేరులో ‘బంగారం’ ఉన్న ఒక ప్రముఖ డాక్టర్ కమ్ పారిశ్రామికవేత్త ఇందులో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆక్రమణలు జోరుగా సాగాయని, ఒక స్థానిక ఎమ్మెల్యే ఇందులో కీలక పాత్ర పోషించారని సమాచారం. వీరికి అల్వాల్ పోలీస్ స్టేషన్‌‌లో పనిచేసిన ఒక సర్కిల్ ఇన్‌‌స్పెక్టర్ (సీఐ) పూర్తి అండదండలు అందించినట్లు హైడ్రా గుర్తించింది. అక్రమార్కులను అడ్డుకున్న వారిపై సదరు సీఐ రివర్స్ కేసులు పెట్టడమే కాకుండా, ఇందుకు ప్రతిఫలంగా కొంతమంది పోలీసు సిబ్బంది ఉచితంగా ప్లాట్లు కూడా పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణ కోసం డీజీపీకి లేఖ రాయడానికి హైడ్రా సిద్ధమవుతోంది.

 గజం రూ. 20 వేల నుంచి రూ. 40 వేలు 

కబ్జాదారులు ఈ ప్రభుత్వ భూమిని గజం రూ. 20 వేల నుంచి రూ. 40 వేల లోపు తక్కువ ధరకే విక్రయించడంతో.. పేదలు, చిన్న వ్యాపారులు నోటరీల ద్వారా వీటిని కొనుగోలు చేసి మోసపోయారు. త్వరలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా స్థలాన్ని సందర్శించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అప్పటికే ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారిని మినహాయించి, మిగిలిన ఖాళీ ప్లాట్లన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. ఆక్రమణల నుంచి కాపాడిన 10 ఎకరాల ఖాళీ స్థలంలో పేదల కోసం డబుల్ బెడ్‌‌రూమ్ ఇళ్లను నిర్మించాలని హైడ్రా ప్రతిపాదించింది. ఇక్కడ ప్లాట్లు కొని మోసపోయిన వారిలో అసలైన నిరుపేదలను గుర్తించి, వారికి ఈ డబుల్ బెడ్‌‌రూమ్ ఇళ్లను కేటాయించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.