Mexico vs Ecuador: ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ రౌండ్ ఆఫ్ 32 పోరులో సహ-ఆతిథ్య దేశం మెక్సికో అద్భుత ప్రదర్శన చేసింది. నిన్న (జూన్ 30న) మెక్సికో సిటీ స్టేడియంలో హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో మెక్సికో (El Tri) 2–0 తేడాతో ఈక్వెడార్‌ను ఓడించి, గ్రాంఢ్ గా రౌండ్ ఆఫ్ 16 లోకి అడుగు పెట్టింది. మెక్సికో ప్లేయర్స్ ఫస్ట్ హాఫ్ లో దూకుడుకు స్టేడియంలోని వేలాది మంది ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.
ఈక్వెడార్‌పై మెక్సికో డామినేషన్:
మెక్సికో కోచ్ జేవియర్ అగుయిరే ఈ మ్యాచ్ కోసం చాలా అగ్రెసివ్ ట్యాక్టికల్ ప్లాన్ సెలక్ట్ చేసుకున్నాడు. ఈ ప్లాన్ మొదటి అరగంటలోనే అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది. మ్యాచ్ 21వ నిమిషంలో మెక్సికో ఆటగాళ్లు మెరుపు దాడి చేశారు. జూలియన్ క్వినోనెస్ ఎంతో చాకచక్యంగా ఈక్వెడార్ గోల్‌కీపర్ హెర్నాన్ గాలిండెజ్‌ను దాటుకుంటూ బంతిని నెట్‌లోకి పంపి మెక్సికోకు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ ఊపులోనే మెక్సికో జట్టు ఈక్వెడార్‌పై మరింత ఒత్తిడి పెంచింది. కేవలం తొమ్మిది నిమిషాల వ్యవధిలోనే (30వ నిమిషంలో) స్టార్ ప్లేయర్ రౌల్ జిమెనెజ్ పెనాల్టీ ఏరియాలో దొరికిన లూజ్ బాల్‌ను కిరాక్ షాట్‌తో గోల్‌గా మలిచాడు. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికే మెక్సికో 2–0తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది.
డిఫెన్స్‌తో ఈక్వెడార్‌ని అడ్డుకున్న మెక్సికో:
రెండో సగభాగంలో ఈక్వెడార్ జట్టు పుంజుకోవడానికి యామర్ మదీనా, ఏంజెలో ప్రెసియాడో లాంటి ఆటగాళ్లను మైదానంలోకి దించి గట్టి ప్రయత్నమే చేసింది. సౌత్ అమెరికన్ జట్టు అయిన ఈక్వెడార్ కొన్ని ప్రమాదకరమైన మూవ్స్ చేసినప్పటికీ.. మెక్సికో డిఫెండర్లు సీజర్ మాంటెస్, జోహన్ వాస్క్వెజ్ లు గోడలా అడ్డు నిలిచారు. ఈక్వెడార్ సీనియర్ ఫార్వర్డ్ ఎన్నర్ వాలెన్సియాను పూర్తిగా కట్టడి చేసి మ్యాచ్ మధ్యలోనే అతను వెనుతిరిగేలా చేశారు. మెక్సికో గోల్‌కీపర్ రావుల్ రంగెల్‌ను ఎదుర్కొనే అవకాశం కూడా ఈక్వెడార్‌కు దక్కలేదు.
రెడ్ కార్డ్‌తో ఈక్వెడార్ ఆశలు సమాధి:
మ్యాచ్ ముగిసే సమయానికి కోచ్ అగుయిరే మరింత వ్యూహాత్మకంగా శాంటియాగో గిమెనెజ్, ఓర్బెలిన్ పినెడాలను మైదానంలోకి దించి ఈక్వెడార్ ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టాడు. దాంతో మ్యాచ్ రెండో సగభాగం ఇంజూరీ టైమ్‌లో ఈక్వెడార్ ప్లేయర్స్ నిరాశ కాస్తా తీవ్ర కోపంగా మారింది. ఈక్వెడార్ డిఫెండర్ పియరో హింకాపీ చేసిన ఒక ఫౌల్ (Reckless Challenge) ను VAR పరిశీలించిన అనంతరం రెఫరీ అతనికి నేరుగా రెడ్ కార్డ్ చూపించి గ్రౌండ్ బయటకి పంపించాడు. దీంతో ఈక్వెడార్ కమ్‌బ్యాక్ చేసే అవకాశం లేకుండా పోయింది. చివరి వరకు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన మెక్సికో.. ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా సొంత గడ్డపై చారిత్రాత్మక విజయంతో రౌండ్ 16కి చేరింది.
GOL DE JULIÁN QUIÑONES ⚽️
— Ángel Rey 👑 (@ailoviutl) July 1, 2026
🇲🇽 México vs Ecuador 🇪🇨 #FIFA #WorldCup26 #EstadioCiudadDeMéxico #CDMX #SomosMéxico pic.twitter.com/FTvfZEcsKI
Mexico scores first against Ecuador. Let’s go Mexico. 🇲🇽 #fifa #fifaworldcup pic.twitter.com/BEleMEJ4aP
— H Town Liv (@onlyhtownliv) July 1, 2026
