పరిహారం మాకెప్పుడు..? .. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ముంపు బాధితులకు తప్పని ఎదురుచూపులు

 పరిహారం మాకెప్పుడు..? .. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం ముంపు బాధితులకు తప్పని ఎదురుచూపులు
  • ఏడేండ్లుగా నష్టపోతున్న ఆరెంద, మల్లారం రైతులు
  • 500 ఎకరాల పైనా భూములు పడావు
  • కాంగ్రెస్​ సర్కార్​పైనే ఆశలు

పెద్దపల్లి, వెలుగు: ‘‘మేమేం పాపం చేశాం.. మాకెందుకు పరిహారం ఇవ్వరు?  ఒక పక్కన ఉన్న రైతులకు ఇస్తున్నారు కదా.. మాకెందుకు ఇవ్వడం లేదు?’’ అంటూ పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఆరెంద, మల్లారం గ్రామాల కాళేశ్వరం ముంపు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్‌‌‌‌‌‌‌‌వాటర్ కారణంగా గత ఏడేళ్లుగా పంటలు సాగు చేయలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న బాధిత రైతులు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించారు.

అయితే ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవతలి వైపు ఉన్న మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని ముంపు బాధిత రైతులకు విడతల వారీగా నష్టపరిహారం అందుతుండగా, పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ఆరెంద, మల్లారం రైతులకు మాత్రం పరిహారం అందకపోవడంపై వారు ప్రశ్నిస్తున్నారు. మంథని మండలంలోని ఆరెంద, మల్లారం తదితర గ్రామాల పరిధిలో దాదాపు 500 ఎకరాలకు పైగా భూములు బ్యాక్‌‌‌‌వాటర్ ముంపునకు గురయ్యాయి.

గత రెండేళ్లుగా ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గి ఈ భూములు బయటపడటంతో అధికారులు క్రాప్ హాలిడేను ఎత్తివేసి, సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. అయితే  బ్యాక్​ వాటర్​ కారణంగా వ్యవసాయ బోర్లు, విద్యుత్ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు, స్తంభాలు దెబ్బతినడంతో సాగు చేయడం సాధ్యంకావడం లేదని రైతులు చెబుతున్నారు. వీటి పునరుద్ధరణ కోసం సంబంధిత అధికారులను సంప్రదించినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

క్రాప్ హాలిడే ఎత్తివేత.. రైతులకు ఇబ్బందులు

కాళేశ్వరం బ్యాక్‌‌‌‌వాటర్ ముంపు భూములకు గత ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించి కొన్ని పంటలకు పరిహారం చెల్లించింది. అయితే మరో నాలుగు పంటల పరిహారం ఇప్పటికీ పెండింగ్‌‌‌‌లోనే ఉందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోవడంతో ముంపు భూములు బయటపడటంతో ఇకపై క్రాప్ హాలిడే ఉండదని అధికారులు చెప్పినట్లు రైతులు పేర్కొంటున్నారు. అదే సమయంలో భూముల్లో సాగు చేయాలని సూచించారని తెలిపారు. అయితే ముంపు కారణంగా బోర్లు, పైపులు, విద్యుత్ మోటార్లు, ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని, వాటిని పునరుద్ధరించకుండా సాగు ఎలా చేయగలమని రైతులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత అధికారులను సంప్రదించగా తామేమీ చేయలేమని చేతులెత్తేశారని ఆరోపిస్తున్నారు. ఒకవైపు క్రాప్ హాలిడే లేకపోవడం, మరోవైపు సాగు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రెండు విధాలుగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అమలుపై ఇంకా స్పష్టమైన నిర్ణయం ప్రకటించలేదు. అయితే సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా అందిస్తామనే సంకేతాలు రావడంతో కాళేశ్వరం బ్యాక్‌‌‌‌ వాటర్ బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.

భూములు ముంపు నుంచి బయటపడినా, సాగుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో అవి ఉపయోగపడటం లేదని చెబుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి మళ్లీ బోర్లు వేయించుకున్నా, భవిష్యత్తులో మరోసారి బ్యాక్‌‌‌‌వాటర్ వస్తుందనే భయంతో పెట్టుబడి పెట్టేందుకు రైతులు వెనుకాడుతున్నారు. దీంతో భూములు బీడుగా మారే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సాగు చేసిన భూములకే రైతు భరోసా వర్తింపజేస్తే తీవ్రంగా నష్టపోతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వమే భూములు  తీసుకోవాలి 

"ఇప్పుడు క్రాప్ హాలిడే లేదు.. సాగు చేసే పరిస్థితి కూడా లేదు. లక్షల రూపాయలు ఖర్చు చేసి మళ్లీ బోర్లు వేయించినా భవిష్యత్తులో బ్యాక్‌‌‌‌వాటర్ మళ్లీ రాదనే హామీ లేదు. భూమి ఉన్నా సాగు చేయలేక రెండు విధాలుగా నష్టపోతున్నాం. ప్రభుత్వం వెంటనే ముంపు భూములను స్వాధీనం చేసుకుని రైతులను ఆదుకోవాలి. అలాగే పెండింగ్‌‌‌‌లో ఉన్న క్రాప్ హాలిడే పరిహారాన్ని వెంటనే చెల్లించాలి."- సుంకరి బాపు, రైతు, మల్లారం