- బిల్డింగ్‌పైనుంచి పడి మృతి చెందిన సాయిఅఖిల్ రెడ్డి
అల్వాల్, వెలుగు: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన గీట్ల సాయి అఖిల్ రెడ్డి (30) స్పెయిన్ దేశంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్‌పైనుంచి పడి మృతి చెందాడు. కూనారం గ్రామానికి చెందిన గిట్ల గుణాకర్ రెడ్డి, సుభాషిణి రెడ్డి దంపతులకు కూతురుతో పాటు కుమారుడు సాయి అఖిల్ రెడ్డి ఉన్నారు. వీరు అల్వాల్ మచ్చ బొల్లారంలోని రైల్వే కాలనీలో నివసిస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ నిమిత్తం అఖిల్ ను స్పెయిన్ కు పంపించారు.
ఆరు నెలల క్రితం స్పెయిన్ కు వెళ్లిన అఖిల్.. నలుగురు స్నేహితులతో కలిసి వాల్సేనియా నగరంలో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో జూన్ 27న సాయంత్రం సమయంలో వారు ఉంటున్న బిల్డింగ్‌పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడడంతో తలకు తీవ్ర గాయాలై మరణించాడు. విషయం తెలుసుకున్న అఖిల్కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అఖిల్ డెడ్‌బాడీని స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం సహాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
