ఎరువుల కొరత తీర్చకుంటే ..బీజేపీ నేతల ఇండ్ల ముందు ధర్నాలు

ఎరువుల కొరత తీర్చకుంటే ..బీజేపీ నేతల ఇండ్ల ముందు ధర్నాలు
  •     మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎరువుల కొరత కొనసాగితే బీజేపీ నాయకుల ఇళ్ల ముందు ధర్నాలు చేపడతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంగళవారం ఎస్‌‌ఐఆర్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతు భరోసాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అవాస్తమన్నారు. 

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతుబంధు కింద రూ.72 వేల కోట్లు అందించగా, తమ ప్రభుత్వం కేవలం 30 నెలల్లోనే రూ.27 వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేసిందన్నారు. ఎరువుల తయారీ, సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, రాష్ట్రాలకు సరఫరా చేసే బాధ్యత కూడా కేంద్రానిదేనని పేర్కొన్నారు. తెలంగాణకు అవసరమైన మేర ఎరువులు సరఫరా చేయకుండా కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తయ్యే ఎరువులను ముందుగా తెలంగాణ రైతులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు రైతుల సమస్యలపై స్పందించాలని కోరారు. యూరియా పంపిణీలో యాప్ కారణంగా ఇబ్బందులు తలెత్తితే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏఈఓలు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి పొన్నం తెలిపారు. ఎల్‌‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 

బీజేపీవి పగటి కలలు..

ఎల్కతుర్తి/భీమదేవరపల్లి, వెలుగు: తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ పగటి కలలు కంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని, వరంగల్ నగర అభివృద్ధిపై 12 ఏండ్లలో బీజేపీ, 30 నెలల్లో కాంగ్రెస్ చేసిన పనులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ బహిరంగ చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో జరుగుతున్న ‘ఎస్‌‌ఐఆర్’ కార్యక్రమాన్ని మంగళవారం పొన్నం పరిశీలించారు. 

అనంతరం ఎల్కతుర్తి మండలం సూరారంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్​ఎస్​ వరంగల్‌‌లో ఎయిర్‌‌పోర్టును ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ తరువాత వరంగల్ ను రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.