ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి..రైలులో తీసుకొచ్చిన యువకుడి అరెస్ట్

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి..రైలులో తీసుకొచ్చిన యువకుడి అరెస్ట్

చందానగర్, వెలుగు: ఒడిశా నుంచి రైలులో హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ఓ యువకుడిని శేరిలింగంపల్లి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 5 లక్షల విలువైన 10 కేజీల గంజాయితోపాటు ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని బౌధ్ జిల్లాకు చెందిన ప్రభాష్ నాగ్ తన స్వగ్రామం కపసిరలో సుబ్నాథ్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి, ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో మంగళవారం రైలులో లింగంపల్లి మీదుగా చందానగర్ చేరుకున్నాడు.

గంజాయి సరఫరాపై ముందస్తు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు, చందానగర్ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ప్రభాష్ నాగ్‌ను తనిఖీ చేసి పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితుడిని చందానగర్ పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.