చర్లపల్లి చెరువు పునరుద్ధరణకు భూమిపూజ

చర్లపల్లి చెరువు పునరుద్ధరణకు భూమిపూజ
  •     పనులను ప్రారంభించిన జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

మల్కాజిగిరి, వెలుగు: హైదరాబాద్ సిటీలోని చెరువుల పరిరక్షణ, పర్యావరణ అభివృద్ధిలో భాగంగా చర్లపల్లి చెరువు పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. హైడ్రా సాంకేతిక సహకారంతో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎస్‌‌ఆర్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర జైళ్లు, సంస్కరణ సేవల డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా డీజీ మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణతో భూగర్భ జలాల పెంపు, పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. 

ఈ ప్రాజెక్టులో ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలను భాగస్వాములను చేయడం ద్వారా వారికి నైపుణ్యాభివృద్ధి, సామాజిక బాధ్యత పెరుగుతుందని తెలిపారు. పనుల్లో భాగంగా చెరువు ఇన్‌‌లెట్ ప్రాంతాల శుభ్రత, సిల్ట్ చాంబర్ల ఏర్పాటు, నీటి ప్రవాహ కాలువల పునరుద్ధరణ చేపట్టనున్నారు. కట్ట వెంట వాకింగ్ ట్రాక్, సోలార్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. జైళ్ల శాఖ, హైడ్రా, ఐఓసీఎల్ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పర్యావరణ పరిరక్షణకు, సమాజ సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.