సెస్‌‌ లెక్కలు తోడుతున్న సర్కార్.. 12 ఏండ్ల లావాదేవీలపై ప్రభుత్వం ఫోకస్

సెస్‌‌ లెక్కలు తోడుతున్న సర్కార్.. 12 ఏండ్ల లావాదేవీలపై ప్రభుత్వం ఫోకస్

 

  • 2014–2026 లావాదేవీలన్నింటిపై సమగ్ర దర్యాప్తు
  •  జగిత్యాల డీసీవో మనోజ్‌‌కుమార్‌‌కు విచారణ బాధ్యతలు
  •  నియామకాలు, కొనుగోళ్లు, ఖాతాల రికార్డులు స్వాధీనం
  •     నిర్వహణ బాధ్యత ఎన్​పీడీసీఎల్​కు అప్పగింత
        ఫైళ్ల దహనం ఘటన తరువాత మళ్లీ చర్చలోకి సెస్

రాజన్న సిరిసిల్ల సెస్‌‌లో గత 12 ఏళ్లుగా జరిగిన లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భారీ అవినీతి, అక్రమ నియామకాలు, అనుమానాస్పద కొనుగోళ్ల ఆరోపణలు రావడంతో 2014 నుంచి 2026 వరకు జరిగిన కార్యకలాపాలపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సెస్ బాధ్యతలను ఎన్పీడీసీఎల్‌‌కు అప్పగించిన సర్కార్.. ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు, నియామకాలపై లోతైన దర్యాప్తు ప్రారంభించింది. ఫైళ్లు కాలిపోయిన ఘటన నుంచి కోట్ల రూపాయల అవినీతి ఆరోపణల వరకు అన్నింటినీ తవ్వి చూస్తుండటంతో సెస్‌‌లో కలకలం రేగింది. విచారణలో ఏమేం బయటపడతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. అటు పాలకవర్గం, ఇటు కొందరు ఉన్నతాధికారుల్లో టెన్షన్ మొదలైంది.

రాజన్నసిరిసిల్ల, వెలుగు:  సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో 12 ఏండ్ల నుంచి జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపేందుకు రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సెస్ కార్యకలాపాలను ఎన్పీడీసీఎల్ కు అప్పగించిన ప్రభుత్వం.. ఇందులో జరిగిన లావాదేవీలు, ఇతర కొనుగోళ్లకు సంబంధించిన అంశాలపై విచారణ చేసేందుకు జగిత్యాల డీసీవో మనోజ్ కుమార్ కు బాధ్యతలు అప్పగించింది. 

కోఆపరేటివ్ చట్టం 1964లోని సెక్షన్ 51 ప్రకారం విచారణ చేపట్టాలని ఆదేశించింది. 2014 నుంచి ఇప్పటి వరకు సెస్ ఉద్యోగుల నియామాకం, ఎంప్లాయిస్ సర్వీస్ రూల్స్ మార్పు లాంటి రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. 2014 నుంచి 2026 వరకు సెస్ చేపట్టిన సమావేశ నివేదికలు, గత 12 ఏండ్ల చెల్లింపులు, కొనుగోళ్లు, ఇప్పటి వరకు స్టాక్ ఉన్న మెటీరియల్ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. 

2014 నుంచి ఇప్పటి వరకు కొనుగోలు రిజిస్టర్లు, ప్రతి పర్చేజ్ కు సంబంధించిన చెల్లింపుల ఓచర్లు, సెస్​ పరిధిలో ఉన్న కరెంట్ ఖాతాలు, పొదుపు ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు పనిచేసిన ఎండీల పేర్లు, వారి జీతభత్యాల వివరాల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజులుగా అధికారులు సెస్ రికార్డుల పరిశీలనలో నిమగ్నమయ్యారు.

బీఆర్​ఎస్  ఏకచత్రాధిపత్యం..?

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సెస్.. ఎన్పీడీసీఎల్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు అందజేస్తోంది. అయితే 1970లో సిరిసిల్లలో ప్రారంభమైన సెస్ నాణ్యమైన విద్యుత్ సరఫరాలో మంచి పేరు సంపాదించింది. 2006లో బీఆర్​ఎస్ సెస్ ఎన్నికల్లో గెలిచింది. తర్వాత 2014 నుంచి వరుసగా బీఆర్​ఎస్ కు చెందిన నేతలే చైర్మన్ గా కొనసాగుతున్నారు. గత పదేండ్లుగా సెస్ పాలక వర్గాలపై ఆవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. 

సెస్ లో కోట్ల రూపాయల ఆవినీతి జరిగిందని ప్రచారం ఉంది. 2022లో సెస్ లో అగ్నిప్రమాదంలో ముఖ్యమైన ఫైల్స్ కాలిపోయాయి. అ ప్రమాదంపైనా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి ఈ వ్యవహారంపై ఫోకస్​ పెట్టింది. ఈ ఏడాది సెస్ లైసెన్స్ రెన్యూవల్ చేయకుండా నిర్వహణ బాధ్యతలను ఎన్పీడీసీఎల్ కు అప్పగించింది. దీంతో సెస్ పాలక మండలికి పదవి ఉన్నప్పటికీ పవర్ లేకుండా పోయింది. ఈ క్రమంలో సెస్​ అక్రమాలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో అటు సెస్ పాలక వర్గాలు, ఉన్నతాధికారుల్లో టెన్షన్​ నెలకొంది. విచారణలో ఏం తేలుతోందనన్నా అయోమయంలో కొందరు ఉన్నట్లు సమాచారం.