- కార్పొరేట్, ప్రైవేట్‌కాలేజీల ‘అఫిలియేషన్’ మాయాజాలం
- 1,350 కాలేజీల అప్లికేషన్లు.. పర్మిషన్ వచ్చింది 256 కాలేజీలకే
- ఖాళీ గదులకే లైబ్రరీ, ల్యాబ్ అని బోర్డులు.. బోర్డుకు బురిడీ
- వెయ్యి కాలేజీల ఫైళ్లు వెనక్కి పంపిన ఇంటర్ బోర్డు
హైదరాబాద్ - వెలుగు: ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల అక్రమాలు పరాకాష్టకు చేరాయి. 2026–-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్ బోర్డు అఫిలియేషన్ ప్రక్రియలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా, కేవలం కాగితాల మీద కాలేజీలు నడిపిస్తూ ఇంటర్ బోర్డునే మేనేజ్మెంట్లు బురడీ కొట్టిస్తున్నాయి. దీంతో ఎప్పుడో అఫిలియేషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నా.. కొద్ది కాలేజీలకే అనుమతులు వచ్చాయి. జిల్లాస్థాయిల్లో ఇంటర్ అధికారుల పర్యవేక్షణ లేమి, ముడుపుల ప్రభావంతో కాలేజీల్లో ఎన్ని లోపాలున్నా.. అన్నీ సక్రమంగా ఉన్నట్టు నివేదికలు ఇవ్వడం ఇప్పుడు ఇంటర్ బోర్డు అధికారులనూ విస్తుపోయేలా చేస్తోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఇంటర్ బోర్డు.. వెయ్యి ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల అఫిలియేషన్లను మళ్లీ వెనక్కి పంపించడం చర్చనీయాంశంగా మారింది.
256 కాలేజీలకే అఫిలియేషన్
రాష్ట్రంలో 1,350 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఈ విద్యాసంవత్సరం అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో మంగళవారం నాటికి 256 కాలేజీలకు మాత్రమే ఇంటర్ బోర్డు అధికారికంగా అనుమతులు ఇచ్చింది. మిగిలిన కాలేజీలకు ఇంకా అఫిలియేషన్లు రాలేదు. ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఆయా మేనేజ్మెంట్లు కాలేజీలకు సంబంధించిన ఫొటోలు, వివరాలు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వచ్చిన ఫొటోలు ఇంటర్ బోర్డు అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కొన్ని కాలేజీలు ఒకే గది ఫోటో తీసి.. దానినే ల్యాబ్‌గా, లైబ్రరీగా చివరికి టాయ్ లెట్గానూ చూపించాయి. ఉదాహరణకు.. ఒక గది తలుపు తీసి బయట లైబ్రరీ అని పేరు రాసి ఫోటో తీయడం, అదే గది తలుపు వేసి బయట టాయ్‌లెట్ అని స్టిక్కర్ అంటించి మరో ఫోటో అప్‌లోడ్ చేయడం వంటివి బయటపడ్డాయి. ఒకే గదికి బయట లైబ్రరీ అని స్టిక్కర్ అంటించి డోర్ తీసి ఫోటో తీశారు. దాన్నే లైబ్రరీ గానూ, క్లాస్ రూముగానూ చూపించారు. అదే గది తలుపు వేసి బయట టాయ్‌లెట్ అని స్టిక్కర్ అతికించి మరో ఫోటో అప్‌లోడ్ చేశారు. అసలు లోపల ఏమీ ఉండడం లేదని, కేవలం పేర్లు మాత్రమే గోడలపై దర్శనమిస్తున్నాయని అధికారులు గుర్తించారు.
ఇవన్నీ తప్పనిసరి అయినా..
వాస్తవానికి ప్రతి క్లాసు రూములో విద్యార్థుల కోసం తగినన్ని డెస్క్‌లు లేదా కుర్చీలు ఏర్పాటు చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టులకు విడివిడిగా ల్యాబ్‌లు ఉండాలి. ప్రాక్టికల్స్ పరికరాలు, కెమికల్స్, మైక్రోస్కోప్‌లు, స్లైడ్స్ అన్నీ అందుబాటులో ఉండాలి. ఇంటర్ సిలబస్ పుస్తకాలతో పాటు రిఫరెన్స్ బుక్స్ ఉండాలి. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, జనరల్ నాలెడ్జ్ బుక్స్ విద్యార్థులకు, స్టాఫ్‌కు అందుబాటులో ఉంచాలి. చాలా కాలేజీల్లో వీటిలో సగం కూడా కనిపించడం లేదని బోర్డు అధికారులు చెప్తున్నారు.
ఫేక్ ఎన్ఓసీలు.. అర్హత లేని లెక్చరర్లు..
ప్రతి కాలేజీకి ఫైర్ ఎన్ఓసీ తప్పనిసరి. దీంతో పాటు మున్సిపల్ పర్మిషన్, స్ట్రక్చరర్ సౌండ్ నెస్ సర్టిఫికేట్, శానిటరీ సర్టిఫికేట్లు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అప్‌లోడ్ చేసిన వీటిలో కొన్ని కాలేజీలు ఫేక్ పెట్టినట్టు అధికారులు ప్రైమరీ ఎంక్వైరీలో గుర్తించారు. దీంతో పాటు చాలా కాలేజీలకు అసలు పార్కింగ్ ప్లేస్ అగ్రిమెంట్ చేసుకోకుండానే.. పలు గ్రౌండ్స్ వివరాలు యాడ్ చేసినట్టు అనుమనాలున్నాయి. దీంతో పాటు కొన్ని కాలేజీలు ఫైర్ సేఫ్టీ లేకపోయినా ఫేక్ ఎన్ఓసీలు సృష్టించి అప్‌లోడ్ చేసినట్లు గుర్తించారు. మరోపక్క ఇక పాఠాలు చెప్పే ఫ్యాకల్టీ విషయంలోనూ మోసాలకు పాల్పడుతున్నారు. పీజీ చేసిన వారే లెక్చరర్లుగా ఉండాలనే నిబంధన ఉన్నా.. ఖర్చు తగ్గించుకోవడానికి డిగ్రీ పూర్తయిన వారితో పాఠాలు చెప్పిస్తున్నారు. వారి వివరాలనూ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం గమనార్హం. కొందరు ఫ్యాకల్టీ ఒక్కొక్కరు మూడు, నాలుగు కాలేజీల్లో చెప్తున్నట్టు గుర్తించారు. మరోపక్క చాలా కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీ లేదని తేలింది.
డీఐఈఓల తీరుపై అనుమానం
ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియలో కొందరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారుల (డీఐఈఓ) వ్యవహారశైలిపై బోర్డు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డీఐఈఓలు ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు ఇలాంటి అక్రమాలు బయటపడాలని, కానీ మేనేజ్మెంట్ల నుంచి కమీషన్లు తీసుకొని కాలేజీల్లో ఏమీ లేకపోయినా, అన్నీ ఉన్నట్లు రిపోర్టులు ఇస్తున్నారని చెప్తున్నారు. అటు డబ్బులు చేతిలోపడ్తేనే వెబ్ సైట్లో అప్రూవ్ చేసి.. ఇంటర్ బోర్డుకు అఫిలియేషన్ కోసం ప్రతిపాదిస్తున్నట్టు మేనేజ్మెంట్లు కూడా బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. కానీ ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినయ్, బోర్డు అధికారులు ఆన్‌లైన్ డేటాను క్షుణ్ణంగా పరిశీలించడంతో ఈ లోపాలన్నీ బయటపడ్డాయి. దీంతో సీరియస్ అయిన బోర్డు సెక్రెటరీ.. తప్పులున్న వెయ్యి కాలేజీల ఫైళ్లను రిటర్న్ చేశారు. ఆయా కాలేజీలను మరోసారి విజిట్ చేసి, నెల రోజుల్లో సమగ్రంగా ఫొటోలతో వివరాలు అందించాలని ఆదేశించారు. కానీ, ఆమె ఆదేశాలను డీఐఈఓలు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాగా, నిబంధనల ప్రకారమే అఫిలియేషన్లు ఇస్తామని సెక్రటరీ స్పష్టం చేస్తున్నారు. వెయ్యి కాలేజీల్లో లోపాలున్నట్టు గుర్తించామని, మరోసారి వెరిఫై చేసి ఫైల్ పెట్టాలని డీఐఈఓలను ఆదేశించినట్లు ఆమె వెల్లడించారు.
